అందుకే  కేరళలో విపత్తులు..!

అందుకే కేరళలో విపత్తులు..!

Delhi (ఢిల్లీ) : పర్యావరణ మార్పుల కారణంగా ఈశాన్య రుతుపవనాలు తమ స్వభావాన్ని మార్చుకున్నాయని, దీంతో దేశంలోని పలు ప్రాంతాలపై ప్రకృతి విపత్తులు సంబావిస్తున్నాయని  నిపుణులు హెచ్చరించారు.  భౌగోళిక స్వరూపం కారణంగా కేరళ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన సంగతి తెలిసిందే.

సముద్ర ఉపరితలం వేడెక్కడంతో అధిక శాతం తేమ, నీటి ఆవిరి అస్థిరమైన వర్షపాతాలకు ప్రధాన కారణమని, పెరుగుతున్న నీటి ఆవిరి అస్థిర వర్షపాతానికి దారితీస్తున్నాయని పేర్కొన్నారు.

జులై 30న ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో కేరళలోని పలు ప్రాంతాల్లో (200మి.మీ లేదా 20 సెం.మీ) గరిష్ట వర్షపాతం రికార్డయింది. ఉదాహరణకు, త్రిస్సూర్‌లోని వడక్కన్‌చెర్రీలో 34 సెం.మీ, పాలక్కాడ్‌లోని అల్తౌర్‌ 30 సెం.మీ, కొజిక్కోడ్‌లోని వడకరలో 28 సెం.మీ, వయనాడ్‌లోని వైత్తిరిలో 28 సెం.మీ వర్షపాతం నమోదైంది. మొత్తంగా జూన్‌ నుండి కేరళలో సరైన వర్షాలు లేవు. జులై 30 నాటికి కేరళలో 5 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. అయితే కేరళ తీరం వెంబడి చురుకైన ఉపరితల ద్రోణి, ఆగేయ అరేబియా సముద్రం మరియు కేరళ తీరానికి ఆనుకుని ఉన్న లక్షద్వీప్‌ దీవుల మీదుగా తుఫాను విస్తరించడంతో గత రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. ఇది కేరళ తీరం వెంబడి మరియు నైరుతి, పశ్చిమ దిశగా (గంటలకు 45 కి.మీ వేగంతో) తేమ గాలులు వీస్తున్నాయని, పశ్చిమ కనుమలు భౌగోళిక మార్పులకు కారణమవుతున్నాయని తెలిపింది.

ఇదే విధంగా 2019, 2021లోనూ కేరళలోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవడంతో వరదలకు దారితీసింది. కేరళలో గత దశాబ్దంలో 2018, 2019, 2021 మరియు ఈ ఏడాది తీవ్రమైన వరదలతో పాటు కొండ చరియలు విరిగి పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

రుతుపవనాల ప్రభావంతో అరేబియా సముద్రం మీద నుండి తేమ వ్యాపిస్తోందని, సముద్రాలు వేడెక్కడంతో బాష్పీభవనం ద్వారా మరింత తేమ చేరుతోందని, ఇవి కొండ ప్రాంతాల మీదుగా వేగంగా కదిలి మేఘాలుగా రూపాంతరం చెంది, వర్షపాతానికి దారితీస్తోందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్‌ పేర్కొన్నారు. అత్యధిక వేడి కారణంగా వాతావరణంలో అధిక నీటి ఆవిరి ఉత్పత్తి అవుతుందని, మేఘాలు ఏర్పడతాయని, ఇది మరింత తీవ్రమైన వర్షపాతానికి దారితీస్తాయని ఎర్త్‌సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఎం.రాజీవన్‌ పేర్కొన్నారు.

కేరళపైనే తీవ్రత ఎందుకు..?

కేరళలో సముద్ర మట్టానికి 48 మీటర్ల దిగువన బ్యాక్‌ వాటర్స్‌ కలిగి వుండటం మరియు పలు ప్రాంతాలు కొండలకు 2,692 మీటర్ల దిగువన ఉంటుంది. కేరళలోని దాదాపు 35 శాతం విస్తీర్ణం 0-50 మీటర్ల ఎత్తులో విగిలిన 39.82శాతం 50-500మీ మధ్య మరియు 24 శాతం పైగా 500 మీ ఎత్తులో ఉంటుందని ఐఎండి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కె.జె. రమేష్‌ పేర్కొన్నారు.

ఐఎండి పూణె పర్యవేక్షణ ప్రకారం.. 1901 నుండి వర్షాకాలంలో అన్ని జిల్లాల సగటు, గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన పెరుగదల నమోదైంది. ఈ వేసవిలో కేరళలో ఏప్రిల్‌ జూన్‌ మధ్య ఐదు వడగాల్పుల రోజులు నమోదయ్యాయి. సాధారణంగా తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మితంగా ఉంటాయి కానీ కేరళ ఇందుకు భిన్నంగా అసాధారణమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళలో వర్షాకాలం కూడా బలహీనంగానే ఉంది. 1901-2012 మధ్య దక్షిణాసియాలో దక్షిణ పాకిస్తాన్‌ నుండి దక్షిణ భారత దేశం నుండి బంగ్లాదేశ్‌ వరకు వర్షపాతం తగ్గుతోందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటరాలజీకి చెందిన కొల్లాం బృందం తెలిపింది. ఉత్తర భారత దేశం నుండి పశ్చిమ కనుమల వరకు ముఖ్యంగా కేరళ వర్షపాతం తక్కువగా నమోదవుతోందని 2015లో ప్రచురించిన ఓ నివేదికలో పేర్కొంది.

అదే బృందం 2017 అధ్యయనంలో 1950 నుండి మధ్య భారతదేశం అంతటా విస్తృతమైన, తీవ్రమైన వర్షపాత ఘటనలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించింది. తీవ్రమైన వాతావరణ పరిణామాలు గుజరాత్‌; మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌; ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్‌, అస్సాం, మేఘాయల మరియు పశ్చిమ కనుమలలోని కొన్ని ప్రాంతాలు గోవా, ఉత్తర కర్ణాటక మరియు కేరళ అంతటా పెద్ద ఎత్తున వరదలు, విపత్తులు, ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీశాయని తెలిపింది.

రుతుపవనాల నమూనా కచ్చితంగా మారింది. గతంలో వర్షాకాలంలో ఏకరీతిలో వర్షాలు ఉండటం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు, అసాదారణ వర్షాలనుచూస్తున్నాం. సగటు వర్షపాతం కూడా నమోదవని పరిస్థితి ఎదురైందని స్కైమేట్‌ వెదర్‌ క్లైమేట్‌ అండ్‌ మెటరాలజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ పలావత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు సగటు వర్షపాతం నమోదు కాలేదు. గాలితో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, తేమ పెరుగుతోంది. అరేబియా సముద్రం వేగంగా వేడెక్కుతోంది. ఇది వాతావరణంలోకి వేగంగా తేమను పంపుతోంది. దీంతో అస్థిరంగా మారుతోంది. ఇవన్నీ గ్లోబల్‌ వార్మింగ్‌తో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS