ఎస్ఐఆర్ ప్రక్రియ జూలై 24 వరకు గడువు పొడిగింపు – ఎంపీడీవో విశ్వమోహన్

తుగ్గలి మండలంలో జొన్నగిరి గ్రామ సచివాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీడీవో విశ్వమోహన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును జూలై 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, తొలగింపు తదితర అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను గడువులోపు సమర్పించాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అధికారులు, బీఎల్వోలు, బిఎల్ఏ లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ ప్రజలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర నాగప్ప, టిడిపి సీనియర్ నాయకులు సంఘాల బాలన్న, జడ్పీహెచ్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవికుమార్ యాదవ్, తుగ్గలి మండల బీసీ సెల్ అధ్యక్షులు సంఘాల కృష్ణ, జొన్నగిరి చెరువు నీటి సంఘం అధ్యక్షులు గుంత రంగస్వామి, వీఆర్వో కాశీ రంగస్వామి, సంబంధిత అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, బీఎల్వోలు, బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. అలాగే తుగ్గలి మండలం పరిధిలోని రామలింగయ్య పల్లె గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమం వీఆర్వో కృష్ణారెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ సూర్యనారాయణ, టిడిపి నాయకులు ఎన్.శివశంకర్, ఎన్.వెంకట్ రాముడు, బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

