
సిఐటియు బహిరంగ సభను జయప్రదం చేయండి
డోన్ న్యూస్ వెలుగు : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కార్మిక వర్గం ఎన్నడూ లేనంతగా నేడు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నదని కావున కార్మికులు,ప్రజలు జనవరి 4న చలో విశాఖ తరలి వచ్చి సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.మాణిక్యం శెట్టి,టి.శివరాం పిలుపునిచ్చారు.

ముందుగా నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక కొండపేటలోని సిఐటియు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాది నాగభూషణం రెడ్డి గారిని, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.కమిషనర్ తో కార్మిక సమస్యలపై చర్చించారు.సాయంత్రం పాత బస్టాండ్ ప్రాంతంలో మహాసభల కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.సీనియర్ నాయకులు జి.కొండయ్య, మండల కన్వీనర్ ఏవి. భాస్కర్ రెడ్డి,కో కన్వీనర్ బి.నాగమద్దయ్య,పట్టణ కోశాధికారి యు.శ్రీనివాసులు, రామచంద్రుడు పాల్గొన్నారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పోరేట్లకు కొమ్ము కాసి కార్మిక ఉద్యమాలను అణచివేస్తున్నాయని కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ఒక వైపు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే జీతాలు మాత్రం పాతాలంలో ఉంటున్నాయని మరో వైపు అదాని అంబానీ వంటి కార్పొరేట్ ల ఆస్తులు మాత్రం వందల రెట్లు పెరుగుతుంటే దేశంలో అసమానతలు పేదరికం నిరుద్యోగం ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారిన పరిస్థితులు దాపురించాయని వారు అన్నారు.

2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహా సభలు భారత దేశంలోని సంపద సృష్టికర్తలు అయిన అసంఘటిత, సంఘటిత, స్కీమ్, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ తదితర రంగాలలో పనిచేస్తున్న కోట్లాదిమంది కార్మిక వర్గం సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమానికి దిశా నిర్దేశం చేయనున్నదని అంతే కాక కార్పోరేట్ విధానాలకు ప్రత్యామ్నాయాలను రూపొందించబోతున్నదని కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు లేబర్ కోడ్స్ రద్దు అయేంతవరకు పోరాడనున్నదని కార్మిక వర్గ అనుకూలమైన విధానాలను అమలు చేయించడానికి పాలకవర్గంపై ఒత్తిడి పెంచడం కోసం సమర శంఖారావం పూరించనున్నదని అఖిల భారత మహాసభలలో చర్చించి రూపొందించిన కర్తవ్యాలను జనవరి 4న జరిగే బహిరంగ సభ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి పిలుపు ఇవ్వనున్నదని ఇంతటి ప్రాధాన్యత కలిగిన మహాసభలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణం వేదికగా మారడం రాష్ట్ర కార్మిక వర్గానికి గర్వకారణమని వారు అన్నారు.

కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి కార్మికులకు జీతాలు పెంచం… జీవితాంతం పనిచేసినా పర్మినెంట్ చేయం… విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తాం… లేదా మూసేస్తాం… పెన్షన్ నామమాత్రం చేస్తాం… కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్ కోడ్స్ పేరుతో నిర్వీర్యం చేస్తాం… సంఘాలు పెట్టనివ్వం… సమ్మెలు చేయనివ్వం… అన్నట్లుగా ఉన్నదని గ్రామీణ వ్యవసాయ కార్మికులకు తిండి పెట్టే ఉపాధి హామీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసి ఉపాధి కూలీల పొట్ట కొడుతున్నదని కార్మిక కర్షక ఐక్యత తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను త్రిప్పి కొట్టడమే అఖిల భారత మహాసభల ప్రధాన లక్ష్యం అని అందుకే పెద్ద ఎత్తున తరలివచ్చి జనవరి 4న జరిగే కార్మిక మహా ప్రదర్శన-బహిరంగ సభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

