FlatNews Buy Now
అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

నంద్యాల న్యూస్ వెలుగు : గ్రీవెన్స్ పరిష్కారంలో నిర్లక్ష్యం.. అధికారులపై కలెక్టర్ అసంతృప్తి

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారుల పనితీరును సమగ్రంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 412 మంది అధికారుల పనితీరును ఓపిటిఎస్ ద్వారా అంచనా వేయగా, 106 మంది అధికారులకు గ్రీవెన్స్ పరిష్కారంలో ‘సున్నా’ మార్కులు రావడం ఆందోళనకరమని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సున్నా ర్యాంకింగ్ పొందిన అధికారుల్లో రెవెన్యూ శాఖ (తహసీల్దార్లు, సర్వే అధికారులు), పంచాయతీరాజ్ శాఖ (ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు), వ్యవసాయ శాఖ (అసిస్టెంట్ డైరెక్టర్లు), పోలీస్ శాఖ (ఎస్‌హెచ్‌ఓలు), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ సూపర్వైజర్లు), హౌసింగ్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, అటవీ శాఖ, మార్కెటింగ్/మార్క్‌ఫెడ్, విద్యాశాఖ (ఎంఈఓలు), రూరల్ డెవలప్మెంట్, డిఆర్డిఏ, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రత్యేకంగా ఆళ్ళగడ్డ, కొత్తపల్లి, కోయిలకుంట్ల, పాణ్యం, నందికొట్కూరు మండలాలు మరియు పట్టణ ప్రాంతాల్లో కొందరు అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదని సూచించారు. అయితే, కొందరు అధికారులు ప్రజలతో నేరుగా మమేకమై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా మంచి పనితీరు కనబరిచారని అభినందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎండార్స్ చేసిన పిటిషన్లను నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రమైన విషయమని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 35 ముఖ్యమైన అర్జీలు పెండింగ్‌లో ఉంచడం లేదా తప్పుడు కారణాలతో మూసివేయడం గమనించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను తిరిగి ఓపెన్ చేసి, వాటిపై జిల్లా స్థాయిలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతోందన్నారు. ఈ 35 పిటిషన్లలో ప్రధానంగా రెవెన్యూ (సిసిఎల్ఎ), దేవాదాయ శాఖ (ఎండోమెంట్స్), అటవీ శాఖ (పిసిసిఎఫ్ పరిధి), విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, ఫ్యామిలీ వెల్ఫేర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రూరల్ డెవలప్మెంట్, పోలీస్ శాఖ, సర్వే శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, వాటర్ రిసోర్సెస్ (ఈఎన్సీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయని తెలిపారు. సంబంధిత ఆర్డీవోలు, ఎండోమెంట్స్ అధికారులు, అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలతో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. వికలాంగ బాలుడికి హౌస్ సైట్ మంజూరులో జరిగిన ఆలస్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి సున్నితమైన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. దేవాదాయ శాఖలో పిటిషన్ల పరిష్కారం మందగమనంగా ఉందని పేర్కొని, పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. వచ్చే వారం ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా పిటిషన్లపై సమీక్ష జరగనున్న నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న అన్ని అర్జీలను తక్షణమే పరిష్కరించి ‘జీరో పెండెన్సీ’ సాధించాలని స్పష్టమైన గడువు విధించారు. మండల, డివిజనల్ స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం ప్రదర్శించాలని సూచించారు. సున్నా పనితీరు కనబరిచిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, పనితీరు మెరుగుపరచని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. పనితీరు ఆధారంగా అధికారులకు ర్యాంకులు కేటాయిస్తున్నామని, విధుల పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. వచ్చే వారం అత్యధిక పెండింగ్ మరియు సున్నా పనితీరు కలిగిన 15 మంది అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS