FlatNews Buy Now
ఎన్నికల్లో ఇచ్చి ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది

ఎన్నికల్లో ఇచ్చి ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది

రెండేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదు, మూడేళ్లలో పెంచేది లేదు
ప‌ల్నాడు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం
రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
పెట్టుబ‌డిదారుల‌ను త‌రిమేసిన చ‌రిత్ర జ‌గ‌న్ రెడ్డిది
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్
న‌ర‌స‌రావుపేట ( న్యూస్ వెలుగు ):  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వంపై అబ‌ద్ధాలు చెబుతూ, దుష్ర్ప‌చారాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ నీచ రాజ‌కీయాలు చేస్తుంద‌ని ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నరసరావుపేటలో సోమ‌వారం నిర్వహించిన కూటమి రెండేళ్ల‌ విజయోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అలాగే డీఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీపై ఆటోలను అందజేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించిన మంత్రి గొట్టిపాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ., ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయ‌న‌ చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి కూట‌మి కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుది అయితే., విద్యుత్ పెట్టుబ‌డిదారుల‌ను రాష్ట్రం నుంచి త‌రిమేసిన నీచ చ‌రిత్ర జ‌గ‌న్ ప్ర‌భుత్వానిద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల కోసమే ఏడాదికి రూ.33 వేల కోట్లను వెచ్చిస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్ల కోసం ఖర్చు చేయడం లేదని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజే రూ.10 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. అన్న‌దాత సుఖీభ‌వ ద్వారా రైతుల‌కు రూ.8,900 కోట్ల‌కు పైగా స‌హాయం చేశామ‌న్నారు. విద్యార్థులు అంద‌రికీ ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేవలం ఒక్క బిడ్డకే అమ్మ ఒడి అమలు చేసినట్లు మంత్రి గొట్టిపాటి విమర్శించారు. ఇలా ఇచ్చిన ప్రతీ హామీని వైసీపీ ప్ర‌భుత్వం తప్పిందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్నఅవినీతి ఆరోప‌ణ‌లు నిరాధారమని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. వైసీపీ పాలనలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోయాయని, 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు కూడా నిలిచిపోవడంతో రైతులకు సాగునీరు అందలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల 920 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ నిర్మాణం కూడా ఆగిపోయిందని తెలిపారు. వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, కోట్లాది రూపాయిలు అప్పులు తెచ్చి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి ఆరోపించారు. రెండేళ్ల కూటమి పాలనలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా విద్యుత్ భారం ప్రజలపై వేయలేదని, రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ చార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రాయలసీమతో పాటు పల్నాడు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పల్నాడులో రెండు సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఏవి అవ‌స‌ర‌మో అవ‌న్నీ చేయ‌డానికి ఎన్డీఏ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. త్వ‌ర‌లోనే కొత్త పెన్ష‌న్ల‌తో పాటు అర్హుల‌కు ఇళ్లు కూడా మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS