
సిఐటియు రాష్ట్ర మహాసభలకు తరలి వెళ్లిన కార్మికులు సిఐటియు నాయకులు
డోన్, న్యూస్ వెలుగు ; నంద్యాల లో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలకు డోన్ నుండి శుక్రవారం ఉదయం వందలాదిగా కార్మికులు సిఐటియు నాయకులు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.మాణిక్యం శెట్టి,టి.శివరాం మాట్లాడుతూ మహా ప్రదర్శన భారీ బహిరంగ సభ ఉంటుందని అనంతరం రాష్ట్ర నలుమూలల నుండి హాజరు కాబోతున్న వెయ్యి మంది ప్రతినిధులతో ప్రతినిధుల మహాసభలు మూడు రోజుల పాటు జరుగుతాయన్నారు. మండల కో కన్వీనర్ బి.నాగమద్దయ్య,సీనియర్ నాయకులు జి.కొండయ్య,పి.రామాంజనేయులు,పట్టణ ఉపాధ్యక్షులు నక్కీ శ్రీకాంత్ మాట్లాడుతూ
ఈ మహాసభలలో గత మూడు సంవత్సరాల కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్మిక పోరాటాలపై వాటి జయాపజయాలపై సమీక్షించుకొని ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోవు మూడు సంవత్సరాల కాలంలో అనుసరించవలసిన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు.కార్మిక వర్గం వాదన ఏ మాత్రం పరిగణలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలుతో ఇప్పటి వరకు ఉన్న కార్మిక చట్టాల రక్షణ కవచాన్ని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనకు వత్తాసు పలుకుతున్న నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చిద్రం చేస్తున్నాయని ఎన్నో పోరాటాలు,ప్రాణ త్యాగాలతో కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్న కార్మిక హక్కులపై కార్పొరేట్లకు లాభాలను దోచిపెట్టడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ కనుసన్నలలోని కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదన్నారు.ఇది యూనియన్ల ఏర్పాటుకు అడ్డంకులు,సమ్మె హక్కుపై ఆంక్షలు,8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కడం పని గంటల పెంపు,శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు,గిగ్ పనులు,భద్రతా చర్యలకు తూట్లు పొడవడం, మహిళలు రాత్రిపూట పని చేయడానికి అనుమతించడం తదితర చర్యలతో తెచ్చిన లేబర్ కోడ్ లు దేశ వ్యాప్తంగా కార్మికుల జీవితాలకు ప్రమాద ఘంటికలు మోగించబోతున్నాయి అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమస్త శ్రమజీవులు ఉద్యమాలకు సన్నద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది అన్నారు.

