
నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార–జలహారతి” కార్యక్రమం
కర్నూలు జిల్లాలో 479 గ్రామాల్లో 3435 పనుల గుర్తింపు
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ వెలుగు : నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార–జలహారతి” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జలధార – జలహారతి కార్యక్రమ నిర్వహణ పై ఇరిగేషన్ ఎస్ఈ, డ్వామా పిడితో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 479 గ్రామ పంచాయతీలలో ఇప్పటివరకు 3435 పనులను గుర్తించినట్లు వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న పాత చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానమైన కాలువలు, వంకలు తదితర జల వనరులను పూడికతీత చేయడం, జంగిల్ క్లియరెన్స్ నిర్వహించడం ద్వారా నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి పనులను గుర్తించి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు వృథా కాకుండా చెరువుల్లో నిల్వచేసి, భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొత్తం గుర్తించిన పనుల్లో ఎం.ఐ. ట్యాంకులకు సంబంధించిన పనులు 380 కాగా, మిగిలిన పనులు నీటి సంరక్షణ పనులని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి, ముఖ్యంగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకు పనులను గుర్తించి, పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహ దిశలు, నీరు ఎక్కువగా చేరే ప్రాంతాలు వంటి విషయాల్లో గ్రామ పెద్దలకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకుంటూ, వారి సమ్మతితో ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని పనులను పూర్తి చేసి చెరువులు, కుంటలు నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణ లో వీబీ రామ్ జీ పథకాన్ని అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల స్థాయి సగటుగా 6.6 మీటర్ల లోతులో ఉండగా, దానిని 3.00 మీటర్ల వరకు పెంచే లక్ష్యంగా పనులను చేపట్టాలన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ చురుగ్గా పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జల వనరుల శాఖ ఎస్ ఈ బాల చంద్రా రెడ్డి, డ్వామా పిడి నరసింహా రెడ్డి పాల్గొన్నారు.

