బీసీలు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సవిత

బీసీలు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సవిత

అమరావతి : ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత మంగళవారం ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తొలుత ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కుల వృత్తులకు ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీలకు ఆర్థిక మేలు కలిగించడంతో పాటు వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. గతంలో ఆదరణ 1, ఆదరణ 2 పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. ఇప్పుడు ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుడుతున్నారని, ఇందుకోసం రూ.1000 కోట్లు వెచ్చిస్తున్నారని వెల్లడించారు. వ్యక్తిగతంగా, గ్రూపులుగా లబ్ధి కలిగేలా ఆదరణ యూనిట్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కుల వృత్తుదారులకు ఆధునిక పనిముట్లు అందజేయనున్నామన్నారు. లబ్ధిదారులకు వృత్తి నైపుణ్యం పెంచుకునేలా శిక్షణ అందజేస్తామన్నారు. లబ్ధిదారులకు రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చేలా యూనిట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదరణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వమే కల్పిస్తుందని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే అన్ని బీసీ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో ఆదరణ 3.0 పథకంపై అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. యూనిట్ల మంజూరులో వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు, వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు పేరేపి ఈశ్వర్, మల్లెల ఈశ్వరరావు, ఆకాశపు స్వామి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS