4 ఏళ్ల చిన్నారి అరుదైన ఘనత..  ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తుగ్గలి ప్రియాన్ష్

4 ఏళ్ల చిన్నారి అరుదైన ఘనత.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తుగ్గలి ప్రియాన్ష్

తుగ్గలి, జూలై 16 ( వెలుగు న్యూస్ ): మండల కేంద్రమైన తుగ్గలికి చెందిన నాలుగేళ్ల ఆరునెలల చిన్నారి కుమ్మరి ప్రియాన్ష్ అరుదైన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మనవడు, కుమ్మరి మణికంఠ–పావని దంపతుల కుమారుడైన ప్రియాన్ష్ తన అసాధారణ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే ప్రియాన్ష్ ఐదు వేర్వేరు 35 ముక్కల జిగ్సా పజిల్స్ను (మొత్తం 175 పజిల్ ముక్కలు) అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. అతని ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఐ.బి.ఆర్ అచిఇవేర్ బిరుదు తో పాటు సర్టిఫికెట్, మెడల్, గుర్తింపు కార్డు, ప్రత్యేక స్మారక పుస్తకాన్ని అందజేసి సత్కరించింది. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాన్ష్ విజయంపై తుగ్గలి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియాన్ష్ తల్లిదండ్రులు మణికంఠ, పావని మాట్లాడుతూ తమ కుమారుడిని నిరంతరం ప్రోత్సహించిన గురువులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాన్ష్ సాధించిన ఈ ఘనత తుగ్గలి గ్రామానికి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు గర్వకారణమని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించగలరని వారు పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS