జిల్లాలో పెండింగ్‌లో ప్రాజెక్టులను పూర్తి చేయాలి 

జిల్లాలో పెండింగ్‌లో ప్రాజెక్టులను పూర్తి చేయాలి 

సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి 

ఈనెల 18న కర్నూలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

న్యూస్ వెలుగు, పత్తికొండ:  జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదావతి, హంద్రీ–నీవా తదితర సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ చేపట్టిన “బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలి” పాదయాత్రలో భాగంగా బుధవారం కోతిరాళ్ల, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. కర్నూలు జిల్లా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందినప్పటికీ, వరుసగా కరువు పరిస్థితులు నెలకొంటున్న సమయంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. వర్షాలు సక్రమంగా లేక, సాగునీటి వనరులు అందుబాటులో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదావతి, హంద్రీ–నీవా వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అన్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నా ఈ ప్రాజెక్టుల పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల పనులు, పెండింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రాజా సాహెబ్ సిపిఐ మండల కార్యదర్శి యు కారుమంచి సిపిఐ జిల్లా సమితి సభ్యులు కారన్న కొత్తపల్లి గిడ్డయ్య నెట్టికంటయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి జోహారాపురం కాశీ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎంకే సుంకన్న శ్రీనివాసులు ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి రంగన్న పందికోన శాఖ కార్యదర్శి రవి ప్రజా సంఘాల నాయకులు నాగేంద్రయ్య సిద్దు రవి రామాంజనేయులు ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS