క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ జి. రాజకుమారి

క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్ వెలుగు ఆగస్టు 12 : నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం ప్రభుత్వ

సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్, వైద్య బృందంతో కలిసి ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్‌లో మొదటి అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండో అంతస్తు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సి సి యు అందుబాటులోకి వచ్చిన అనంతరం అత్యవసర, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో అన్ని రకాల ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో గతంలో ఉన్న నీటి ఎద్దడి సమస్యను సంప్‌ నిర్మాణం ద్వారా పరిష్కరించామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని వార్డులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.
రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గైనకాలజీ వార్డులోని రోగులకు హై-ప్రోటీన్ డైట్‌, ఇతర రోగులకు సాధారణ డైట్‌, విధుల్లో ఉన్న వైద్యులకు అవసరమైన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రోగులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదీ లేనిదీ నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య విభాగం, సేవలపై సరైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి రోగికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచిత వైద్య చికిత్స అందేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూ లో చికిత్స పొందుతున్న రోగుల బంధువులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్నందున, వారితో సిబ్బంది సౌమ్యంగా, ఓర్పుతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. రోగుల బంధువులకు పరిస్థితిని స్పష్టంగా వివరించి, వారికి అవసరమైన సమాచారం అందించేలా సిబ్బందికి క్రమం తప్పకుండా ఓరియంటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య సేవల నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, రోగుల సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS