
స్వచ్ఛ పదం, త్రాగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్
నంద్యాల జిల్లా న్యూస్ వెలుగు : గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛ పదం కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణ, త్రాగునీటి నిర్వహణ తదితర అంశాలపై స్పెషల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రంథాలయ ఉద్యోగులు చాలా కాలంగా జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో గ్రంథాలయ సెస్ బకాయిల చెల్లింపులను అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నులలో గ్రంథాలయ సెస్‌ను సకాలంలో చెల్లించి బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశించారు. వచ్చే వారంలో నిర్వహించే సమీక్ష నాటికి పురోగతి కనిపించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ఆలయ మార్గాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకుని నీటి నిల్వలు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. త్రాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ క్లోరినేషన్ ప్రక్రియను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వాటర్ ట్యాంకులను శుభ్రపరచడం, నీటి నమూనాలను పరీక్షించడం ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులను నివారించాలని ఆదేశించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ కోసం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా సేకరించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా, మండల స్థాయి కమిటీలు సమర్థవంతంగా పనిచేసి కుటుంబాల వివరాలను పరిశీలించి ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా త్రాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, స్వచ్ఛ పదం వంటి మౌలిక సేవలపై ప్రజల్లో సంతృప్తి పెరిగేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. విద్యుత్ సమస్యల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీల ఆదాయం పెంపుపై దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత నిధులు సమకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

