
కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
కడప: గురువారం సాయంత్రం ఒంటిమిట్ట టిటిడి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి , టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ , తదితర అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై, మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ జరగనుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు వ్యవస్థ, హెలిప్యాడ్ ఏర్పాటు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రశాంతంగా స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా పటిష్టమైన బ్యారికేడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భక్తులకు అన్నదానం, గ్యాలరీలలో తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ, మీడియా కవరేజ్ నిమిత్తం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు, మెడికల్ క్యాంపుల నిర్వహణ, గ్యాలరీలలో అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ సిబ్బంది ఏర్పాటు వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు.
టీటీడీ అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకొని బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

