
డెంగ్యూ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం
రాజంపేట, న్యూస్ వెలుగు : రాజంపేట మున్సిపల్ కార్యాలయం నందు శనివారం డెంగ్యూ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం రాజంపేట మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని డెంగ్యూ జ్వరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వికాస్ , డాక్టర్ లక్ష్మీప్రసన్న , డాక్టర్ సౌజన్య , డాక్టర్ మహేష్ , మలేరియా యూనిట్ ఆఫీసర్ స్వామి దాసు మరియు వైద్య సిబ్బంది డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దానిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలపై క్లుప్తంగా వివరించారు. డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలియజేశారు.
ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డెంగ్యూ నివారణ చర్యల్లో ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ కోరారు.

