నీటి సామర్థ్య పెంపుకు కార్యాచరణ 

నీటి సామర్థ్య పెంపుకు కార్యాచరణ 

నంద్యాల, న్యూస్ వెలుగు :  జిల్లాలో కాస్కేడ్ విధానం ద్వారా ట్యాంకులను సమర్థవంతంగా నింపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో ‘జలధార’ కార్యక్రమంపై భూగర్భ జలశాఖ, జలవనరుల శాఖ, డ్వామా ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్  నోడల్ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి ‘జలధార’ కార్యక్రమానికి సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. జిల్లాలో గుర్తించిన 23 కాస్కేడ్ వ్యవస్థల ద్వారా 86 ట్యాంకులను నింపేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, చిట్టచివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లాకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సరిహద్దులు, వాగులు, ట్యాంకులు, భూభాగ వినియోగ వివరాలతో కూడిన జియోస్పేషియల్ మరియు జి ఐ ఎస్ మ్యాప్స్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే జిల్లాలోని 23 కాస్కేడ్ ట్యాంకులను టోపోషీట్ల ఆధారంగా ఒకే మ్యాప్‌లో సమగ్రంగా పేర్కొన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లోని త్రాగునీటి సమస్యల పరిష్కారం, బనగానపల్లి పశ్చిమ ప్రాంతంలో కొత్త కాస్కేడ్ ప్రతిపాదన, కొలిమిగుండ్ల, సంబంధిత ప్రాంతాల్లోని నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా భూగర్భ జలశాఖ అధికారి రఘురాం, జలవనరుల శాఖ అధికారి శివశంకర్, డ్వామా పీడీ సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS