కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..?
మోదీ 3.0 ప్రభుత్వం మరో కొన్ని రోజుల్లో రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోనుంది. ఈ కీలక మైలురాయిని పురస్కరించుకుని కేంద్రమంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు అంతర్గతంగా చకచకా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యాల సాధన, పరిపాలనా బాధ్యతల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని శాఖల పేలవమైన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. మంత్రులు, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ పురోభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పని చేయాలని, ప్రజాధనాన్ని వీలైనంతగా పొదుపు చేయాలని స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థ పనితీరు మారాలని, వికసిత భారత్ లక్ష్యం కోసం రంగాల వారీగా దూసుకుపోవాలని మోదీ పిలుపునిచ్చారు.
20 నుంచి 30 మంది మంత్రుల మార్పు..
ఈసారి జరగబోయే పునర్వ్యవస్థీకరణలో దాదాపు 20 నుంచి 30 మంది మంత్రుల వరకు మార్పులు చేర్పులు ఉండవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. పనితీరు సరిగ్గా లేని కొందరు సీనియర్లను తప్పించి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, ముఖ్యంగా యువత, మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉంది. గతంలో మోదీ 2.0 హయాంలో జూలై 7, 2021న జరిగిన అతిపెద్ద కేబినెట్ ప్రక్షాళనలో 43 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేయగా, 12 మంది సీనియర్లకు ఉద్వాసన పలికారు. ఇప్పుడు కూడా అదే తరహాలో గట్టి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పట్టున్న కొందరు అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు మళ్లీ కేబినెట్‌లో చాన్స్ ఇవ్వనున్నారు.

