పత్తికొండ, న్యూస్ వెలుగు : “వంద మాటలు చెప్పలేని విషయాన్ని ఒక చిన్న ఫోటో స్పష్టంగా చెప్పగలదు” అంటారు. కాలం వేగంగా ముందుకు సాగిపోతున్నా, జీవితంలో మళ్ళీ తిరిగి రాని మధుర జ్ఞాపకాలను, క్షణాలను చిరస్థాయిగా నిలిపివేసే అద్భుతమైన

కళే ఫొటోగ్రఫీ. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని పత్తికొండ పట్టణంలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో బుధవారం నాడు పత్తికొండ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’ (వరల్డ్ ఫోటోగ్రఫీ డే) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం ముఖ్యఅతిథి మోహన్, అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… 1839వ సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ డాగ్యురే ‘డాగ్యురియోటైప్’ అనే మొదటి వాణిజ్య ఫొటోగ్రఫీ ప్రక్రియను కనిపెట్టారని, ఆ సాంకేతికతను ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రపంచానికి ఉచితంగా బహుమతిగా అందించిన రోజు జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఆగస్టు 19న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం వ్యాపారమో లేదా సరదానో మాత్రమే కాదని… అదొక కళ, సృజనాత్మకత, చరిత్ర అని కొనియాడారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఫోటోగ్రఫీ రంగంలో సరికొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వృత్తిపరంగా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు, లోటుపాట్లను సభ్యులందరూ కలిసికట్టుగా సరిదిద్దుకుంటూ, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు రాజు, వీరేష్, షఫీ, షేక్షా, జనార్ధన్, వీరాంజి, రమేష్, రామకృష్ణ, టోనీ, కర్ణ, లచ్చి, నూరు, అశోక్ తో పాటు స్థానిక కెమెరామెన్లు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Thanks for your feedback!