
పంచాయతీ కార్మికులకు కూడా 21 వేల రూపాయలు చెల్లించాలి సిఐటియు
ప్యాపిలి న్యూస్ వెలుగు : గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా నెలకు 21 వేల జీతం ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్.ఏ.చిన్న రెహమాన్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ (సిఐటియు) యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర యూనియన్ నాయకులు నెట్టేకళ్ అధ్యక్షతన కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు,మరో 20,000 మంది గ్రీన్ అంబాసిడర్లు, 700 మంది ఎన్ఎంఆర్ లు దశాబ్దాల తరబడి గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతకు పాటుపడుతున్నారన్నారు.గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వాలు వీరికి జీతాలు పెంచలేదని ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రాష్ట్రం అంతటా ఒకే విధమైన జీతం చెల్లించడం లేదని ఒక్కో చోట ఒక్కో విధంగా నెలకు 6000 నుండి 12 వేల రూపాయల లోపు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారన్నారు. కొన్నిచోట్ల మహిళా కార్మికులకు పురుష కార్మికులతో సమానంగా జీతాలు చెల్లించడం లేదని ఇస్తున్న అరకొర జీతాలు కూడా ప్రతి నెల సక్రమంగా చెల్లించడం లేదని నాలుగు నెలల నుండి 24 నెలల వరకు కూడా బకాయిలు ఉన్నాయని గ్రీన్ అంబాసిడర్లకు అనేక చోట్ల మూడు సంవత్సరాలుగా జీతాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్,కరెంటు చార్జీల బారాలు భరించలేక కుటుంబాలు అర్ధ ఆకలితో గడుపుతున్నాయన్నారు.దీనికి తోడు ప్రతినెల జీతాలు రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురికావాల్సి వస్తుందన్నారు.టెండర్లకు సంబంధించి 2015-2023లో హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు కావడం లేదని 1999లో ఇచ్చిన 551 జీవోలో గుర్తింపు కార్డులు,కనీస వేతనము,పిఎఫ్,ఈఎస్ఐ అమలు చేయాలని ఉన్నా నేటికీ అమలు చేయడం లేదని ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలన్నారు.పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న విధులనే నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు నెలకు 21 వేల రూపాయల జీతం చెల్లిస్తున్నారని వారి మాదిరే గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా 21000 జీతాలు చెల్లించాలని,132,142, 680 జీవోలను అమలు చేయాలని అమలు చేయని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,టెండర్ల విషయంలో 2015 మరియు 2023లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను కచ్చితంగా అమలు చేయాలని,చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలని,ప్రమాద బీమా 10 లక్షలకు,దహన సంస్కారాలకు 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులతో సేకరించిన సంతకాలను ఈనెల 25న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలో కలిసి వారికి అందజేయనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రంగస్వామి,వెంకటరెడ్డి,బ్రహ్మయ్య, నాగరాజు,బాలకృష్ణ,కాజా, లక్ష్మీదేవి,సాలమ్మ, ఓబులమ్మ,అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.
అభినందనలతో…
ఎస్.ఏ.చిన్న రెహమాన్
సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి

