
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి ర్యాలీ
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
ఆదోని, న్యూస్ వెలుగు జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదోనిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శ్రీనివాస్ భవన్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడం లేదని విమర్శించారు.
రైతులకు భరోసా, పంటల బీమా, మహిళలకు ప్రకటించిన ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజలపై అప్పుల భారం మోపుతోందని విమర్శించారు.
ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోందని, దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా ఉంటుందని సాయి ప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బి. దేవా, మండల అధ్యక్షుడు గుర్నాథ్ రెడ్డి, యువజన నాయకులు నల్లారెడ్డి సన్నీ, మూర్తి, మురళి రెడ్డి, రామలింగేశ్వర యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

