
హస్త కళారూపాలు కేవలం వస్తువులే కాదు ఆయా ప్రాంతాల సాంస్కృతి: మంత్రి
అమరావతి న్యూస్ వెలుగు: హస్త కళారూపాలు కేవలం వస్తువులే కాదు ఆయా ప్రాంతాల సాంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు. వారసత్వ ప్రదాతలు హస్త కళాకారులు. చరిత్రకు ఆనవాలుగా నిలిచే హస్త కళలకు, హస్త కళాకారులకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. హస్త కళాకారులకు గౌరవప్రదమైన జీవనం అందిస్తూనే, హస్త కళారూపాలకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సాంకేతికతను సాధనంగా వినియోగిస్తోంది. లేపాక్షి షో రూమ్ ల నిర్వహణతో పాటు కళాకారుల గుర్తింపు, సృజనాత్మకతతో వారు రూపొందించే కళా రూపాలను సామాన్య ప్రజలకు సైతం సకాలంలో అందించేలా ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించింది. ఆయా కళారూపాల విశిష్టత, సాంస్కృతి సంప్రదాయలను తెలిపేలా ఏఐ టూల్ ను వినియోగిస్తూ మరో ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న వినియోగదారుల అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో హస్త కళలకు ప్రాచుర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాచీన భారతీయ సాంస్కృతి, సంప్రదాయాలను హస్త కళారూపాల్లో ప్రస్తుత తరానికి హస్త కళాకారులు అందిస్తూ వస్తున్నారు. సరైన ప్రాచుర్యం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో హస్త కళాకారుల జీవనం భారంగా గడుస్తోంది. లేపాక్షి షో రూమ్ ల నిర్వహణతో ప్రభుత్వాలు హస్త కళలకు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అవి పూర్తిస్థాయిలో హస్త కళాకారులకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అటు కళలను ప్రోత్సాహిస్తూనే, ఇటు హస్త కళాకారులకు మెరుగైన జీవనం అందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీహెచ్డీసీ) ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒకవైపు నేటితరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తూ, లేపాక్షి షో రూమ్ లకు నూతన హంగులు కల్పిస్తోంది. మరో వైపు హస్త కళాకారులకు నూతన ఆవిష్కరణలు చేసేలా శిక్షణ అందజేస్తోంది. అదే సమయంలో హస్త కళాకారులు రూపొందించిన కళారూపాలను వినియోగదారుల చెంతకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు తరంగా అనే రియల్ టైమ్ వ్యవస్థను,ఏఐ టూల్ తో కళాక్షి అనే యాప్ ను రూపొందించింది. ఈ రెండింటినీ త్వరలోనే ప్రారంభించి, హస్త కళల అమ్మకాలు పెంచేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
‘తరంగా’తో లేపాక్షి నిర్వహణ:
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీహెచ్డీసీ) ఆధ్వర్యంలో 19 లేపాక్షి షో రూమ్ లున్నాయి. వాటిలో ఢిల్లీ, కోల్ కత్తా, హైదరాబాద్ మినహా మిగిలిన 16 షో రూమ్ లూ ఏపీలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయా షో రూమ్ ల నిర్వహణలో జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో సాగుతోంది. ఇకపై అన్ని షో రూమ్ ల నిర్వహణకు రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరిగేలా తరంగా పేరుతో ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించారు. రియల్ టైమ్ లో షో రూమ్ ల నిర్వహణ, స్టాక్ వివరాలు, సిబ్బంది పనితీరు, రోజు వారీ అమ్మకాలు వంటి అంశాలను నేరుగా కమాండ్ కంట్రోల్ ద్వారా ఇకపై పర్యవేక్షించనున్నారు. ఏపీహెచ్డీసీ పరిధిలో అన్ని షో రూమ్ ల్లో హస్త కళారూపాల స్టాక్ తో పాటు వాటి అమ్మకాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు. ఏయే ప్రాంతాల్లో ఏయే కళారూపాలకు డిమాండ్ ఉందో గుర్తించి, అందుకనుగుణంగా సప్లయ్ చేస్తుంటారు. ఏ షో రూమ్ ల్లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి… ఎక్కడ తక్కువగా ఉన్నాయో గుర్తించి అందుకు తగట్లు చర్యలు తీసుకోడానికి తరంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉపయోగపడనుంది. ముఖ్యంగా సిబ్బంది పనితీరును ఏ రోజుకారోజు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
అలెర్ట్స్ తో సప్లయ్..
తరంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థలో మరో ముఖ్య అంశం అలెర్ట్స్. ఒక షో రూమ్ ల్లో స్టాక్ తక్కువగా ఉన్నప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎరుపు రంగులో అలెర్ట్స్ చూపుతుంది. నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు ఆరెంజ్ రంగులో అలెర్ట్స్ చూపుతుంది. ఈ అలెర్ట్స్ తో స్టాక్ పై స్థానికంగా ఉండే షో రూమ్ నిర్వాహాకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులకు కూడా సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. దీనివల్ల వినియోగదారులకు కళారూపాలను అందివ్వగలుగుతారు. అదే సమయంలో హస్త కళాకారులకు ఆయా కళా రూపాల తయారీకి ఆర్డర్లు అందించే అవకాశం కలుగుతుంది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఏయే షో రూమ్ ల్లో స్టాక్ ఎక్కువగా ఉంది గుర్తించి, వాటిని తక్కువ స్టాక్ ఉన్న షో రూమ్ లకు అందించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల హస్త కళారూపాల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ లో ఏఐ టూల్ ‘కళాక్షి’ లింక్:
ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల డోర్ డెలివరీ మాదిరిగా వినియోగదారుల చెంతకే హస్త కళారూపాలు అందజేయాలన్న సదుద్దేశంతో వాట్పాప్ ద్వారా కళాక్షి పేరుతో సమాచారమందించనున్నారు. ఏఐ టూల్ తో రూపొందించిన ఈ కళాక్షి లింక్ లో హస్త కళా రూపాలు, వాటి తయారీ విధానం, సాంస్కృతి సంప్రదాయ నేపథ్యం వివరించారు. వాటితో పాటు ఆయా కళారూపాలు తయీరు చేసే హస్త కళాకారుల గురించి సమాచారం అందిస్తారు. వినియోగదారుడికి కావాల్సిన కళారూపం, వాటి వివరాలను తెలపాలని కోరుతూ సెల్ ఫోన్ లో కళాక్షి వాట్సాప్ లింక్ లో తెలుగులో గాని, ఇంగ్లీష్ గాని టైప్ చేయగానే రెండు మూడు సెకన్ల వ్యవధిలో మొత్తం సమాచారం అందుతుంది. దీనివల్ల హస్త కళా రూపాల ప్రాముఖ్యతతో పాటు హస్త కళాకారుల నేపథ్యం కూడా వినియోగదారులకు తెలుసుకునే సౌలభ్యం కలుగుతుంది. అదే సమయంలో వినియోగదారులకు తమకు కావాల్సిన కళారూపాలను ఇంటి వద్దే ఉండి ఎంచుకునే సదుపాయం కలుగుతుంది. తద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే హస్త కళారూపాలను డోర్ డెలివరీకి అవకాశం కలుగుతుంది.
హస్త కళాకారులకు గౌరవ ప్రద జీవనమే లక్ష్యం : మంత్రి సవిత
ఏపీలో ఆయా ప్రాంతాల సాంస్కృతీ సంప్రదాయాలను తెలిపే హస్త కళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తద్వారా హస్త కళాకారులకు ఏడాది పాటు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకోసం తరంగా రియల్ టైమ్ వ్యవస్థ తో పాటు కళాక్షి అనే వాట్సాప్ లింక్ ను కూడా లేపాక్షి ఎండీ విశ్వ, ఆయన బృందం రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీహెచ్డీసీ) పేరు మీద వెబ్ సైట్ ఉందన్నారు. నేరుగా వినియోగదారుల ఇళ్లకే వారు కోరిన కళారూపాలను అందించాలన్న ఉద్దేశంతో ఏఐ టూల్ కళాక్షి వాట్సాప్ లింక్ ను రూపొందించారన్నారు. మొత్తం అన్ని లేపాక్షి షో రూమ్ లను రాష్ట్ర స్థాయి నుంచే పర్యవేక్షించడానికి తరంగా ఏఐ ఆధారిత రియల్ టైమ్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హస్త కళలకు ప్రాచుర్యం కల్పిస్తూ, హస్త కళాకారులకు గౌరవ ప్రదజీవనం అందించాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. సీఎం చంద్రబాబు ఆశయాన్ని తరంగా రియల్ టైమ్ వ్యవస్థతో పాటు కళాక్షి వాట్సాప్ లింక్ద్ ద్వారా నెరవేర్చే అవకాశం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు.

