
ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపింది. 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 78,796 మంది రైతులకు చెందిన 59 వేలకు పైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారు. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించారు. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వాటిల్లింది. సత్వరమే స్పందించి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.


