
మద్యం సేవించి విధులకు హాజరు… పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్
ఆన్లైన్ హాజరు లోపం… సిబ్బందికి షోకాజ్ నోటీసులు
నంద్యాల, న్యూస్ వెలుగు : గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పంచాయతీ సెక్రెటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం సేవించిన స్థితిలో హాజరైనట్లు గమనించిన కలెక్టర్ వెంటనే పోలీసుల సహాయంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించించారు. పరీక్షలో 100 ఎంఎల్‌కు 65 ఎంజి ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు వెళ్లడైన నేపథ్యంలో తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. పసురపాడు గ్రామ సచివాలయంలో ఆన్లైన్ అటెండెన్స్ వేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలు వంటి అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. సేవల నాణ్యతపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఆదేశించారు. స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డ్” కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీవోపై చార్జీలు ఫ్రేమ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

