
జనగణనకు ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలి
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలోని ప్రజలందరూ జనగణన 2027 విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని తహశీల్దార్ పద్మావతమ్మ కోరారు. బుధవారం మండల కేంద్రంలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమంను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జనగణన 2027 – స్వీయ లెక్కింపు సౌకర్యం కార్యక్రమం 16 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు భారత ప్రభుత్వం నిర్వహించనున్న జనగణన 2027లో భాగంగా, ప్రజల సౌకర్యార్థం స్వీయ లెక్కింపు అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానంలో గృహాలు స్వచ్ఛందంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. కావున గృహాలకు ఎన్యూమరేటర్ రావడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా మరియు వేగంగా వివరాలు సమర్పించవచ్చు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (HLO Phase–1) సమయంలో, పౌరులు తమ మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేసుకొని, కుటుంబ సభ్యులు, నివాస పరిస్థితులు, మౌలిక వసతులు తదితర వివరాలను నమోదు చేయవచ్చు. సమర్పించిన సమాచారం సెన్సస్ చట్టం ప్రకారం గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజలందరూ ఈ డిజిటల్ సౌకర్యాన్ని వినియోగించుకొని, సమయానికి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరడమైనది. అయితే, స్వీయ లెక్కింపు చేయని గృహాలను కవర్ చేయడానికి ఎన్యూమరేటర్లు సందర్శిస్తారని తెలిపారు.

