FlatNews Buy Now
డిజిటల్ సేవల విస్తరణ – నైపుణ్యాభివృద్ధికి భారీ ప్రోత్సాహం

డిజిటల్ సేవల విస్తరణ – నైపుణ్యాభివృద్ధికి భారీ ప్రోత్సాహం

కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత
•గత రెండేళ్లలో కార్మిక రంగంలో సమగ్ర సంస్కరణలు– సంక్షేమ పథకాల పునరుద్ధరణ

రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

అమరావతి,  న్యూస్ వెలుగు జూన్ 12:రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సామాజిక బాధ్యతగా, అభివృద్ధి లక్ష్యంగా భావించి పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పునాదులు కార్మికుల శ్రమతోనే నిర్మితమవుతాయని, అందువల్ల కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత రెండేళ్లలో కార్మిక శాఖలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, డిజిటల్ సేవలు, నిర్మాణ కార్మిక సంక్షేమ చర్యలు, ఇఎస్‌ఐ వైద్య సేవల విస్తరణ, పారిశ్రామిక భద్రతా కార్యక్రమాల పురోగతిని వివరించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న కార్మిక సంక్షేమ వ్యవస్థకు పునర్జీవం…
గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కార్మిక సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు ఉన్నప్పటికీ వాటిని కార్మికుల కోసం వినియోగించకుండా వదిలేశారని, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, నిర్మాణ కార్మిక బోర్డులు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక సంక్షేమ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు. నిర్మాణ కార్మికుల కోసం నిలిచిపోయిన సంక్షేమ పథకాలను మళ్లీ ప్రారంభించడమే కాకుండా వాటిని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణ…
గతంలో నిలిచిపోయిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రభుత్వం 01 మార్చి 2026 నుండి పునరుద్ధరించిందన్నారు. వివాహ బహుమతి ₹20,000, ప్రసూతి ప్రయోజనం ₹20,000, సహజ మరణ సహాయం ₹60,000, అంత్యక్రియల ఖర్చులు ₹20,000 చొప్పున అందజేస్తోందన్నారు. ఈ మొత్తాలను మరింత పెంచే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు అన్ని ప్రయోజనాలను ఆధార్ ఆధారిత డీబీటీ (DBT) ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయడం ద్వారా పారదర్శకతను తీసుకురావడం జరిగిందన్నారు.

25 ఇంటిగ్రేటెడ్ లేబర్ అమినిటీస్ కాంప్లెక్సుల లక్ష్యం…
అసంఘటిత రంగ కార్మికులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 25 ఇంటిగ్రేటెడ్ లేబర్ అమినిటీస్ కాంప్లెక్సుల (ILACs) ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఉపాధి సమాచారం, త్రాగునీరు, వై-ఫై, పారిశుధ్య సౌకర్యాలు, కార్మికుల నమోదు, సంక్షేమ అవగాహన, నైపుణ్యాభివృద్ధి సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నమూనాను విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

డిజిటల్ గవర్నెన్స్‌లో విప్లవాత్మక మార్పులు…
కొత్త లేబర్ కోడ్స్‌కు అనుగుణంగా ట్రేడ్ యూనియన్ నమోదు, కార్మికుల నమోదు, గ్రీవెన్స్ పరిష్కారం, సంక్షేమ క్లెయిమ్స్, బాల కార్మికుల పర్యవేక్షణ, అర్థ న్యాయ విధులు తదితర సేవల కోసం పూర్తి స్థాయి ఆన్‌లైన్ మాడ్యూల్స్ అభివృద్ధి చేయబడ్డాయి. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కార్మికులు ఇంటి వద్ద నుంచే సేవలను పొందే అవకాశం కల్పించబడింది. కార్మిక శాఖ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకత, వేగవంతమైన సేవల పంపిణీ, రియల్ టైమ్ పర్యవేక్షణ సాధ్యమైంది.

88.67 లక్షల అసంఘటిత కార్మికుల నమోదు…
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఇ-శ్రమ్ పోర్టల్‌లో 88.67 లక్షల మంది నమోదు అయ్యారన్నారు. 2024-25లో 4,33,191, 2025-26లో 3,59,628 కొత్త నమోదులు జరిగినట్లు తెలిపారు. అదేవిధంగా, ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 18.26 లక్షల మంది కార్మికులు నమోదు అయ్యారన్నారు. రాష్ట్రంలో కార్మికుల సమగ్ర డేటాబేస్ సృష్టించి, భవిష్యత్తులో అమలు చేయబోయే సామాజిక భద్రతా పథకాలకు పునాది వేయబడిందని మంత్రి తెలిపారు.

₹1,408.58 కోట్ల సెస్ వసూళ్లు…
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 2024-25లో ₹675.39 కోట్లు, 2025-26లో ₹733.19 కోట్లు, మొత్తంగా ₹1,408.58 కోట్లు సెస్ వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రతా కార్యక్రమాలకు వినియోగించేందుకు కార్యాచరణ రూపొందించబడిందని తెలిపారు.

కార్మిక బోర్డుల పునరుజ్జీవనం…
ఏపీ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించి ఒక చైర్మన్, 22 మంది సభ్యులతో బలోపేతం చేశామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల పునరుద్ధరణ, లేబర్ అడ్డాల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం, సేవల డిజిటలైజేషన్ చేపట్టబడిందన్నారు. సంఘటిత రంగ కార్మికుల కోసం 10 సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు.

85,000 మందికి నైపుణ్యాభివృద్ధి లక్ష్యం…
2019-24 మధ్య నిలిచిపోయిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరించి, 85,000 మంది లబ్ధిదారులకు శిక్షణ అందించే లక్ష్యంతో కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయన్నారు. ఇందులో 25,000 మంది కార్మికులకు NAC ద్వారా, 60,000 మంది కుటుంబ సభ్యులకు APTS ద్వారా, మొత్తం 41 ఉద్యోగ అవకాశాలు కలిగే ట్రేడ్లలో శిక్షణలు అందించబడుతున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, సర్టిఫికేషన్, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు.

లేబర్ కోడ్స్ అమలుకు సిద్ధత…
29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర లేబర్ కోడ్స్ గా ఏకీకృతం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించి వాటాదారుల అభిప్రాయాలను సేకరించిందన్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత, సకాలంలో వేతనాలు, సురక్షిత పని స్థలాలు; యజమానులకు సరళీకృత అనుమతులు; ప్రభుత్వానికి డిజిటల్ గవర్నెన్స్ వంటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.

Ease of Doing Businessలో కీలక సంస్కరణలు….
మహిళలకు భద్రతా ప్రమాణాలతో నైట్ షిఫ్ట్‌లలో పని చేసే అవకాశం, రోజువారీ పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచడం, దుకాణాలు మరియు సంస్థలకు జీవితకాల నమోదు, పెద్ద పట్టణాల్లో 24×7 కార్యకలాపాలకు అనుమతి వంటి సంస్కరణలు అమలు చేయబడ్డాయన్నారు. వీటి ద్వారా పెట్టుబడులు, ఉపాధి, పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణం కల్పించబడుతోందని మంత్రి తెలిపారు.

కేర సురక్ష బీమా పథకం…
కొబ్బరి కార్మికుల కోసం ప్రారంభించిన కేర సురక్ష బీమా పథకం ద్వారా తొలి దశలో 2,500 మంది కార్మికులకు బీమా రక్షణ కల్పించబడిందన్నారు. మరణం లేదా శాశ్వత వైకల్యానికి ₹7 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹3.5 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు ₹2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకం రూపొందించబడిందన్నారు.

శ్రమశక్తి అవార్డుల పునరుద్ధరణ…
2018 తరువాత నిలిచిపోయిన శ్రమశక్తి అవార్డులను ప్రభుత్వం పునరుద్ధరించి 46 శ్రమశక్తి అవార్డులు, 28 ఉత్తమ యాజమాన్య అవార్డులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, యాజమాన్యాల విశిష్ట సేవలను గుర్తించి ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

7.85 లక్షల కార్మికులకు ఆరోగ్య పరీక్షల లక్ష్యం…
భవన నిర్మాణ కార్మికుల కోసం 7.85 లక్షల మంది కార్మికులను కవర్ చేసే ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. వృత్తి సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించడం, ఆరోగ్య డేటా సేకరణ, నివారణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో విశేష ఫలితాలు…
బాల కార్మికులు, వెట్టిచాకిరి నిర్మూలనలో కార్మిక శాఖ నోడల్ శాఖగా పనిచేస్తూ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిందన్నారు. ఈ క్రమంలో 1,399 మంది బాల కార్మికులను రక్షించడం, 963 కనీస వేతనాల క్లెయిమ్స్ దాఖలు చేయడం, ₹24.32 లక్షల పరిహారం సాధించడం, 19 మంది పిల్లల కోసం ₹3.80 లక్షల రికవరీ చేయడం వంటి ముఖ్యమైన విజయాలు సాధించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఇఎస్‌ఐ సేవల విస్తరణ – కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు…
గత రెండు సంవత్సరాలలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ కార్మికుల ఆరోగ్య భద్రత, వైద్య సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల బలోపేతం మరియు డిజిటల్ గవర్నెన్స్ రంగాలలో విశేష పురోగతి సాధించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 15.32 లక్షల మంది ESI భీమా వ్యక్తులు మరియు దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత రెండేళ్లలో 8,036 శస్త్రచికిత్సలు, 178 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించబడగా, గతంలో నిలిచిపోయిన వైద్య సేవలను పునరుద్ధరించి మరింత విస్తరించడం జరిగిందని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త వైద్య మౌలిక సదుపాయాల కల్పన కోసం 14 భూమి బదలాయింపులు మరియు కేటాయింపులు పూర్తి చేయడంతో పాటు, తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి 191 అదనపు పోస్టులను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆరోగ్య సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు 92 మంది వైద్య, పారామెడికల్ మరియు పరిపాలనా సిబ్బందికి పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 30 కొత్త ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, 57 ప్రస్తుత డిస్పెన్సరీల అప్‌గ్రేడేషన్, అలాగే విశాఖపట్నం మరియు అమరావతిలో రెండు ESIC మెడికల్ కాలేజీల స్థాపనకు చర్యలు చేపట్టబడ్డాయన్నారు. అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం సీఎస్‌ఆర్ భాగస్వామ్యంతో 3 అంబులెన్సులను సమీకరించడం జరిగిందన్నారు.

అదే విధంగా, గ్రీవెన్స్ రీడ్రెస్సల్ వ్యవస్థ, మొబైల్ హెల్త్ అప్లికేషన్లు, ధన్వంతరి–ఇ-ఔషధి సమన్వయం వంటి కార్యక్రమాల ద్వారా డిజిటల్ హెల్త్ గవర్నెన్సుకు శ్రీకారం చుట్టి, పారదర్శకమైన మరియు ప్రజాకేంద్రిత వైద్య సేవల అందుబాటును మరింత మెరుగుపర్చడం జరిగిందని మంత్రి తెలిపారు.

పారిశ్రామిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత….
రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతను అత్యున్నత ప్రాధాన్య అంశంగా గుర్తించిన ప్రభుత్వం “జీరో యాక్సిడెంట్స్” (Zero Accidents) లక్ష్యంతో సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలను ముందస్తుగా నివారించడం, కార్మికుల ప్రాణభద్రతను కాపాడడం మరియు సురక్షితమైన పనివాతావరణాన్ని నెలకొల్పడం కోసం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ దిశగా సేఫ్టీ ఆడిట్లు, అత్యవసర సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్, భద్రతా అధికారుల శిక్షణ కార్యక్రమాలు, విశ్వవిద్యాలయాలు మరియు నిపుణ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, అలాగే జిల్లా సంక్షోభ నిర్వహణ బృందాల (District Crisis Groups) ఏర్పాటు వంటి కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, సేఫ్టీ అలర్టులు, ఇన్సిడెంట్ అలర్టులు, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ప్రమాణాల అమలును మరింత బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.

ఈ సమగ్ర చర్యల ఫలితంగా పరిశ్రమల్లో భద్రతా సంస్కృతి మరింత బలపడటమే కాకుండా, పారిశ్రామిక ప్రమాదాలు మరియు ప్రమాదాల కారణంగా సంభవించే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల భద్రత, పరిశ్రమల స్థిరాభివృద్ధి మరియు పెట్టుబడిదారుల విశ్వాసం అనే మూడు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు, కమినషర్ గంధం చంద్రుడు, ఫ్యాక్టరీల డైరెక్టర్ మోహనరావు, ఐఎంఎస్ డైరెక్టర్ ఆంజనేయులు, రాష్ట్ర బాయిలర్స్ విభాగం అధికారి ఉమామహేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS