
తుగ్గలి రైల్వే స్టేషన్‌లో గుంతకల్లు–మార్కాపురం ప్యాసింజర్ రైళ్లకు నిలుపుదల కల్పించాలి
టిడిపి నాయకులు చెన్నంపల్లి రామయ్య
తుగ్గలి, జూన్ 12 న్యూస్ వెలుగు : మండల కేంద్రమైన తుగ్గలిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో తుగ్గలి రైల్వే స్టేషన్‌లో ఇటీవల ప్రారంభమైన గుంతకల్లు–మార్కాపురం ప్యాసింజర్ రైలు (నెం. 57407), మార్కాపురం–గుంతకల్లు ప్యాసింజర్ రైలు (నెం. 57408)లకు నిలుపుదల కల్పించాలని టిడిపి నాయకులు చెన్నంపల్లి రామయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులు, రోగులు, ఉద్యోగుల, వ్యాపారుల, విద్యార్థుల సౌకర్యార్థం ఈ రెండు రైళ్లను తుగ్గలి రైల్వే స్టేషన్‌లో ఆపాలని కోరారు. తుగ్గలి రైల్వే స్టేషన్‌కు రోడ్డు మార్గం ద్వారా మంచి అనుసంధానం ఉండటంతో పాటు గుంతకల్లు–డోన్ రైల్వే మార్గంలో ప్రతిరోజూ వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి ముందు తుగ్గలి రైల్వే స్టేషన్‌లో నిలిచే యశ్వంతపూర్–విజయవాడ ప్యాసింజర్ రైలుకు గణనీయమైన ఆదాయం వచ్చేదని, ఆ వివరాలను రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొద్ది రోజుల క్రితం కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఏడీఆర్ఎంను కలిసి ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే తుగ్గలి మండల పరిధిలో 16 గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యాల కోసం తుగ్గలి రైల్వే స్టేషన్‌పై ఆధారపడుతున్నారని తెలిపారు. గిరిజన ప్రజల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని రైళ్ళను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు

