డీఎస్సీపై వైసీపీది రాజకీయ ఆరోపణలే: టిడిపి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిళ్ళకుంట ఎడవల్లి తిమ్మప్ప

డీఎస్సీపై వైసీపీది రాజకీయ ఆరోపణలే: టిడిపి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిళ్ళకుంట ఎడవల్లి తిమ్మప్ప

తుగ్గలి, ఆగస్టు 12 ( వెలుగు న్యూస్ ): ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని టీడీపీ తుగ్గలి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నేత మామిళ్ళకుంట ఎడవల్లి తిమ్మప్ప తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగ అభ్యర్థుల్లో అనవసరమైన ఆందోళన, అపోహలు కలిగించే విధానానికి వైసీపీ నేతలు స్వస్తి పలకాలని సూచించారు. మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగానే పూర్తి చేశాయని తిమ్మప్ప పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రతిభా ప్రాతిపదిక, రిజర్వేషన్ నిబంధనలు, రోస్టర్ విధానాలను పాటించినట్లు స్పష్టం చేశారు. మొత్తం 15,941 ఉపాధ్యాయ పోస్టులకు నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై అనవసర ఆరోపణలు చేయడం ద్వారా వైసీపీ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయ క్రీడకు పాల్పడుతోందని తిమ్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారికంగా వెల్లడైన సమాచారం ఆధారంగా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మి అభ్యర్థులు ఆందోళనకు గురికావద్దని కోరారు. “డీఎస్సీపై వైసీపీది రాజకీయ డ్రామా. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలు ఆడొద్దు” అని తిమ్మప్ప హెచ్చరించారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని హితవు పలికారు. డీఎస్సీ నియామక విధానంపై అభ్యర్థుల్లో నెలకొనే సందేహాలను తొలగించేందుకు రిజర్వేషన్, మెరిట్ తదితర అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ అదే అంశాన్ని పదేపదే రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సముచితం కాదన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, రాజకీయ లబ్ధి కోసం వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని మామిళ్ళకుంట ఎడవల్లి తిమ్మప్ప స్పష్టం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS