
అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
తెలంగాణ న్యూస్ వెలుగు : 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడుదామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు.

