
తుగ్గలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి చేతుల మీదుగా ప్రారంభం
తుగ్గలి, జూన్ 12 న్యూస్ వెలుగు : మండల కేంద్రమైన తుగ్గలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలను అందించడం ద్వారా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పాఠ్యపుస్తకాలను సక్రమంగా వినియోగించుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. విద్యార్థులకు విద్యా సామగ్రి సకాలంలో అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. పాఠ్యపుస్తకాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి ఎంఈవో రామ వెంకటేశ్వర్లు గౌడ్, ఎంఈవో ప్రవీణ, ప్రధాన ఉపాధ్యాయులు అగస్టీన్, ఉపాధ్యాయులు సుధాకర్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయుడు చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

