దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ బైరెడ్డి శబరి

 

రూ.4 కోట్ల విలువైన సహాయక పరికరాల పంపిణీ

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల జిల్లా (న్యూస్  నౌ ) జూన్ 15: సమాజంలోని విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు స్వయం సమృద్ధితో జీవించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డులో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ (ADIP) పథకం కింద దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరితో కలిసి కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్, వృద్ధులకు చేతికర్రలు తదితర సహాయక పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే సుమారు 5 వేల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి వివిధ సహాయక పరికరాల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి అర్హులైన ప్రతి ఒక్కరూ వాటి ప్రయోజనాలను పొందాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలు తమ పరిసరాల్లోని అర్హులకు చేరవేసి వారికి తోడ్పడాలని కోరారు. దివ్యాంగుల పెన్షన్ల పెంపు అంశంపై స్పందిస్తూ, 90 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి పూర్తిగా ఇతరులపై ఆధారపడే వ్యక్తులకు ప్రత్యేక నిబంధనల మేరకు అధిక పెన్షన్ అందజేస్తున్నట్లు వివరించారు. అర్హుల వివరాలను వైద్య నిపుణులతో కూడిన మెడికల్ బోర్డు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.16 కోట్ల నిధులు కేటాయించిందని, మరింత మంది లబ్ధిదారులకు మద్దతు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 24,679 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15.26 కోట్ల మేర పెన్షన్లు అందుతున్నాయని, అదనంగా డయాలసిస్ మరియు మంచానికే పరిమితమైన పక్షవాతం బాధితులకు ప్రత్యేకంగా రూ.1.53 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. దివ్యాంగులకు సామాజిక భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం తరహాలోనే దివ్యాంగ శక్తి కార్యక్రమం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలి. జిల్లాలో ఇప్పటివరకు 1.42 లక్షల మంది దివ్యాంగులు ఈ సేవలను వినియోగించుకుని రూ.58.64 లక్షల విలువైన ప్రయాణ సౌకర్యం పొందినట్లు వెల్లడించారు. హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కోసం స్వర్ణగ్రామ్, స్వర్ణవార్డ్ కార్యాలయాల్లో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని, సాధారణ వినతిపత్రాలు సమర్పించడం ద్వారా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు, సంబంధిత విభాగాలు పరిశీలించిన అనంతరం తుది అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీంకో సంస్థ కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ కొనియాడారు. గత మూడు వారాలుగా సంస్థకు చెందిన సిబ్బంది జిల్లాలోనే ఉండి లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా పరికరాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలీంకో ద్వారా గుర్తించిన 1,847 మంది దివ్యాంగులకు దాదాపు రూ.4 కోట్ల విలువైన సహాయక పరికరాలను అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులలో ఉన్న ఆత్మవిశ్వాసం, పట్టుదల సమాజానికి ఆదర్శమని, వారి ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తున్న తల్లిదండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తగిన స్థలం గుర్తించి త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, స్థలాల కబ్జా, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని హామీ ఇచ్చారు. దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, ఉమ్మడి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాతిమా, ఆర్డిఓ విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ శేషన్న, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ రవికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS