
నంద్యాల జిల్లా కలెక్టర్ అసంతృప్తి
నంద్యాల, (న్యూస్ వెలుగు) మార్చి 16: జిల్లాలో నిర్వహించిన అక్షరాంధ్ర కార్యక్రమం పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు ముందు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, అన్ని శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్షలపై సమీక్ష
జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొత్తం 25,035 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, అందులో 15,000 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి, 10,035 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉన్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, మెడికల్ క్యాంపులు వంటి కనీస వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పారిశుధ్యం మరియు తాగునీటి సరఫరాను మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరి
పరీక్ష గదులు విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని, సరైన గాలి వెలుతురు ఉండేలా కిటికీలు, తలుపులు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమకు కేటాయించిన పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, సరైన బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చూడాలని తెలిపారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు ఎండలో నిలబడకుండా షెడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. 25 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఈ పరీక్షలు పునాది కావడంతో ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
అక్షరాంధ్ర పరీక్షలు విజయవంతం – అధికారులను అభినందించిన కలెక్టర్
జిల్లాలో మొత్తం 1,01,181 మంది అభ్యాసకులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,00,993 మంది హాజరై పరీక్ష రాశారని, కేవలం 88 మంది మాత్రమే గైర్హాజరయ్యారని వెల్లడించారు. తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వయోజన విద్య, డిఆర్డిఏ, డ్వామా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. అయితే విధులకు హాజరుకాని స్పెషల్ అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. అభ్యాసకుల మార్కులను ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు తక్షణమే నిర్ణీత యాప్‌లో నమోదు చేసి వాట్సాప్ గ్రూపులో ధృవీకరించాలని ఆదేశించారు.
ఈ-ఆఫీస్ వ్యవస్థ అమలు
కోర్టు కేసులకు సంబంధించిన కౌంటర్, వకాలాత్ ఫైళ్లతో సహా అన్ని ఫైళ్లు ఇకపై ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిజికల్ కాపీలపై సంతకాలకు ముందు ఈ-ఆఫీస్‌లో అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. తహసీల్దార్, ఆర్డీఓ మరియు కలెక్టర్ కార్యాలయాల మధ్య జరిగే ఫైళ్ల కదలికలు కూడా పూర్తిగా ఈ-ఆఫీస్‌లోనే ఉండాలని తెలిపారు.
హాస్టళ్లలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై స్పష్టత
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, హాస్టళ్లకు సరిపడా సరఫరా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 155 హాస్టళ్లను తహసీల్దార్లు తనిఖీ చేయాలని ఆదేశించారు.
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు
రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ సేవల వినియోగంలో రాష్ట్రం 17వ స్థానంనుంచి 9వ స్థానానికి చేరుకుందని కలెక్టర్ తెలిపారు. 95523 00009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా పార్సెల్ బుకింగ్, హాల్ టికెట్లు, మార్కుల వివరాలు వంటి అనేక సేవలను పొందవచ్చని వివరించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఈ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు.
పి4 మానిటరింగ్ – మార్గదర్శి కార్యక్రమం
పి4 మానిటరింగ్‌లో భాగంగా మార్గదర్శులను ‘బంగారు కుటుంబం’తో ట్యాగింగ్ చేయడం పూర్తిగా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ప్రతినిధులు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రతి మార్గదర్శికి ఒక బంగారు కుటుంబాన్ని కేటాయించడం 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కౌశలం అసెస్మెంట్పై కలెక్టర్ అసంతృప్తి
జిల్లాలో 49,931 మంది అర్హులలో కేవలం 10,324 మంది మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్‌కు హాజరుకావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో 4,071 మంది మాత్రమే అర్హత సాధించారని తెలిపారు. మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదో అధికారులు సమీక్షించాలని ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్, ఆరోగ్య సూచికలపై దృష్టి
మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు సాధించేందుకు క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సెకండరీ హెల్త్ సూచికల్లో జిల్లా వెనుకబడి ఉందని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.
ఎల్ నినో ప్రభావం – ముందస్తు చర్యలు
నంద్యాల జిల్లాల్లో ఎల్ నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఐలాండ్ల వద్ద గ్రీన్ షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అలాగే ఉపాధిహామీ, పీఆర్ పనులపై కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

