
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి: జమలయ్య
న్యూస్ వెలుగు కర్నూలు : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం చాలా దారుణమని తక్షణమే గ్రామ సభలు నిర్వహించి భూయజమాని ప్రమేయం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, కర్నూల్ రూరల్ మండలంలోని పెద్దటేకూరు, తడకనకపల్లి,పసుపుల తదితర గ్రామాల్లో పర్యటించి కౌలురైతులకు గుర్తింపు కార్డులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామంలో కూడా ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నప్పటికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని కౌలురైతుల సంఘం ప్రతినిధి బృందానికి కౌలురైతులు చెప్పారు.ఈ సందర్భంగా పి.జమలయ్య మాట్లాడుతూ… కౌలు గుర్తింపు కార్డులు ఆధారంగా భూమిలేని ప్రతి కౌలురైతు కుటుంబానికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలురైతుల ఖాతాలో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భూ యజమాని బ్యాంకు బకాయిలతో సంబంధం లేకుండానే ప్రత్యేకంగా కౌలురైతులకు పంట రుణాలు అందించాలని కోరారు .గత ఈక్రాఫ్ బుకింగ్ తో సంబంధం లేకుండానే కౌలు రైతులందరికీ యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు రూరల్ మండలం కార్యదర్శి బి.రాముడు,రైతు సంఘం నాయకులు చదువుల కాశీనాథ్, భాషా తదితరులు పాల్గొన్నారు.

