తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు

తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు

తిరుపతి, న్యూస్ వెలుగు :   ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత మూడేళ్లలో కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య 175 శాతం మేర పెరిగింది. టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ (స్విక్కార్) విడుదల చేసిన గణాంకాలు ఈ షాకింగ్ నిజాన్ని వెల్లడించాయి.

స్విక్కార్ నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి 2,556గా ఉన్న కొత్త క్యాన్సర్ రిజిస్ట్రేషన్ల సంఖ్య.. 2025 చివరి నాటికి 7,000 దాటింది. ఇదే కాలంలో క్యాన్సర్‌గా నిర్ధారణ అయిన కేసులు 1,437 నుంచి 3,413కి రెట్టింపు అయ్యాయి. 2022 మధ్యకాలం నుంచి ఇప్పటివరకు దాదాపు 11,000 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ప్రధాన కారణాలు ఇవే..
ఈ ప్రాంతంలో గుట్కా, పొగాకు ఉత్పత్తుల వాడకం విపరీతంగా ఉండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. పొలాల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని, నోటిలో నొప్పిలేని తెల్లటి మచ్చలు వంటి ప్రాథమిక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు తెలిపారు. వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వస్తుండటంతో చికిత్స సంక్లిష్టంగా మారుతోందని పేర్కొన్నారు.

అయితే, కేసుల పెరుగుదల వ్యాధి తీవ్రతను సూచిస్తున్నప్పటికీ, ప్రజలలో పెరుగుతున్న అవగాహన, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం కూడా ఒక కారణమని స్విక్కార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లే రోగులు ఇప్పుడు స్థానికంగానే చికిత్స పొందేందుకు ముందుకు వస్తున్నారని ఆయన వివరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS