భూగర్భ జలాల పెంపునకు  జలవనరుల సమగ్ర గణాంకాల సేకరణ

భూగర్భ జలాల పెంపునకు  జలవనరుల సమగ్ర గణాంకాల సేకరణ

డోన్, ప్యాపిలి మండలాల్లో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్

నంద్యాల, న్యూస్ వెలుగు: జిల్లాలో 100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సమిష్టిగా అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్

హాల్‌లో నిర్వహించిన ‘జలధార’ కార్యక్రమానికి సంబంధించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ పాల్గొని ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు సంబంధిత శాఖల అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల నివారణ లక్ష్యాలుగా తీసుకుని100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి అధికారి తమ పరిధిలో ప్రణాళికాబద్ధంగా పని చేసి స్పష్టమైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. జిల్లాలోని 30 మండలాల్లో 11 మండలాలు నీటి నిల్వ విషయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వర్షాల అనంతరం భూగర్భ జలాల మట్టం 3 మీటర్ల లోపల, వర్షాలకు ముందు 8 మీటర్ల లోపల ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఆ మేరకు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. కృష్ణా నది జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, తెలుగు గంగ, కెనాల్, కేసీ కెనాల్‌లుగా విభజించి సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. అయితే డోన్ మండలంలోని కొచ్చెరువు ప్రాంతంలో భూగర్భ జలాలు సుమారు 45 మీటర్ల లోతులో ఉన్నాయని, జిల్లాలోని 165 గ్రామాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులోకి పడిపోయిందని చెప్పారు. డోన్, ప్యాపిలి మండలాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు. ప్రతి మండలానికి సంబంధించిన భూగర్భ జలాల గణాంకాలను సిద్ధం చేయాలని, గ్రామ మరియు మండలాల వారీగా నీటి మట్టం వివరాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువులు, కుంటలు తదితర నీటి వనరులపై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న 330 మైనర్ ఇరిగేషన్ చెరువుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని చెప్పారు. నీటి వనరులు నిండే విధానాలపై అవగాహన కల్పిస్తూ, వర్షపాతం, మేజర్ కెనాల్స్ ద్వారా నీటి మళ్లింపు, సహజ ప్రవాహాల ద్వారా నీటి చేరిక వంటి అంశాలలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని చెరువులు నిండడం కొన్ని కెనాల్స్ ద్వారా, మరికొన్ని సహజ ప్రవాహాల ద్వారా, మిగిలినవి పూర్తిగా వర్షాలపై ఆధారపడుతున్నాయని పేర్కొన్నారు.
కాస్కేడ్ సిస్టమ్’ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఒక చెరువు నిండిన తరువాత అదనపు నీరు వరుసగా ఇతర చెరువులకు చేరే విధానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 27 కాస్కేడ్లలో మొత్తం 86 ట్యాంకులు ఉన్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపు కోసం ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, రాక్ ఫిల్ డ్యామ్స్, కాంటూర్ ట్రెంచెస్ వంటి నిర్మాణాలను గుర్తించి, వాటి స్థితిగతులను అంచనా వేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో భూగర్భ జలాల మట్టం, మండల సగటు, ప్రస్తుత నీటి వనరుల నిర్మాణాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చెరువుల స్థితి, ఫీడర్ ఛానల్స్ పరిస్థితి, సహజ నీటి ప్రవాహాలపై పరిశీలన జరిపి చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని, ఎండకాలంలో కూడా నీటి నిల్వ ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా భౌగోళికంగా కృష్ణా, పెన్నా బేసిన్లలో విస్తరించి ఉందని కలెక్టర్ తెలిపారు. ఇందులో సుమారు 75% కృష్ణా బేసిన్‌లో, 25% పెన్నా బేసిన్‌లో ఉందన్నారు. తుంగభద్ర బేసిన్ కృష్ణా పరిధిలో భాగం కాగా, నందికొట్కూరు తుంగభద్రలో, ఆళ్లగడ్డ పెన్నా బేసిన్‌లోకి వస్తాయన్నారు. పెన్నా బేసిన్‌లో కుందేరు నది ముఖ్య ఉపబేసిన్ అని, జిల్లాలో నీటి నిల్వల కొరత వల్ల వరదనీరు వృథాగా ఇతర జిల్లాలకు వెళ్లుతోందని కలెక్టర్ వివరించారు. ఈ వర్క్ షాప్ లో జల వనరుల శాఖ ఎస్ఈ శివశంకర్ రెడ్డి, భూగర్భ జల అధికారి రఘురాం, డ్వామా పీడీ సూర్యనారాయణ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ నాగరాజు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS