
తాగునీటి సమస్యలకు ముందస్తు చర్యలు మంత్రి పయ్యావుల కేశవ్
నంద్యాల న్యూస్ వెలుగు ఏప్రిల్ 04: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన బడ్జెట్ అవుట్‌రీచ్ 2026–27 కార్యక్రమం అనంతరం, వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న బోర్‌వెల్స్‌కు తప్పనిసరిగా జియో-మ్యాపింగ్ చేయాలని, అలాగే మరమ్మతు చేయగలిగేవి, చేయలేనివి ఎంతమేర ఉన్నాయో వివరాలు సేకరించాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ జూనియర్ ఇంజనీర్లు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమాచార మాధ్యమాల్లో వెలువడే త్రాగునీటి సమస్యలపై వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్‌కు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే అవసరాన్ని బట్టి డీఎంఎఫ్ నిధులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సూచించారు.

