విద్యార్థులకు నగదు బహుమతులు అందించిన డిప్యూటీ ఎంపీడీవో
పగిడిరాయిలో పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు నగదు బహుమతులు డిప్యూటీ ఎంపీడీవో శ్రీహరి
తుగ్గలి, జూన్ 15 ( న్యూస్ వెలుగు ): పదో తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు 89.13 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పగిడిరాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ ఎంపీడీవో పి.శ్రీహరి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 532 మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన డి. వైష్ణవికి, 495 మార్కులతో ద్వితీయ స్థానం పొందిన డి. రిజ్వానాకు, అలాగే మూడో స్థానం సాధించిన మరో విద్యార్థికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


