
చెన్నంపల్లి పంచాయతీలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు
తుగ్గలి, జూన్ 11 న్యూస్ వెలుగు : మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామపంచాయతీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దాదాపు రూ.4 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేశులు తెలిపారు.
గురువారం చెన్నంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
గ్రామంలో రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన, విద్యుత్ వసతుల మెరుగుదలతో పాటు ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు వివరించారు. గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
చెన్నంపల్లి అభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మా భాష, టీడీపీ నాయకులు రాజేంద్ర గౌడ్, లక్ష్మీనారాయణ చౌదరి, అక్బర్ బాషా, రామయ్య, కోటేష్ గౌడ్, సంజీవ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

