
అక్టోబర్‌లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. డిసెంబర్లో పరీక్షలు…!
డిఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు లేవు పూర్తి పారదర్శకతతోనే నియామక ప్రక్రియ నిర్వహించాం
రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్
అమరావతి, జూన్ 11 న్యూస్ వెలుగు డెస్క్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా అక్టోబర్ నెలలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ డిఎస్సీ-2025 నియామకాలపై మరొక సారి సమగ్ర వివరణ ఇచ్చారు. డీఎస్సీ-2025 నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలుపై కొంత మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
2024లో నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయకపోవడానికి కారణం….
2024లో నోటిఫై చేసిన సుమారు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో పూర్తి చట్టబద్ధత, స్పష్టత, నిబంధనల అనుసరణను నిర్ధారించాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు, టెట్–డీఎస్సీ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా పరిపాలనా సౌలభ్యాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రెండు అంశాల నేపథ్యంలో నియామక ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమైనట్లు ఆయన స్పష్టం చేశారు.
డిఎస్సీ ప్రక్రియలో పేపర్ లీకేజీకి అవకాశమే లేదు…
డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడిందని కోన శశిధర్ తెలిపారు. సిస్టమ్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారిక యాక్సెస్ ఉంటుందని, కేవలం ఇద్దరు నియమిత శాశ్వత ఉద్యోగులు మాత్రమే డేటా అప్లోడ్ చేసే అధికారం కలిగి ఉంటారని తెలిపారు. పాస్వర్డులు నిరంతరం మార్చబడుతూ ఉంటాయని, అనధికార ప్రవేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువల్ల డేటా లీకేజీ లేదా పేపర్ లీకేజీకి ఎటు వంటి అవకాశం ఉందన్నారు.
మెరిట్ లిస్ట్ తయారీ పూర్తిగా నిబంధనల ప్రకారం…
డిఎస్సీ ఎంపికల్లో టెట్ మార్కులకు 20 శాతం, డిఎస్సీ మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి జనరల్ మెరిట్ లిస్ట్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. టెట్ మార్కులను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ రావడం అంటే అభ్యర్థి ఎంపికైనట్లుగా కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ తదితర అంశాల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చినప్పటికీ, వెరిఫికేషన్ సమయంలో అనర్హత తేలితే తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కవచ్చని వివరించారు.
గ్రీవెన్స్ పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ…
అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రభుత్వం మూడు స్థాయిల్లో గ్రీవెన్స్ మెకానిజాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా స్థాయి పరిశీలన, రాష్ట్ర స్థాయి కమిటీ, కమిషనర్ స్థాయి తుది పరిశీలనతో అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారించడం జరుగుచున్నదన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలపై పూర్తి వివరణ…
స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు.
ఇంటర్-కాలేజియేట్ పోటీలకు ప్రస్తుత నియామకాల్లో ప్రాధాన్యం లేదు…
ప్రస్తుతం అమల్లో ఉన్న జీఓ ఎంఎస్ నెం.4 ప్రకారం ఇంటర్-కాలేజియేట్ పోటీల్లో పాల్గొనడం లేదా సాధించిన విజయాలను ఉద్యోగాల కోసం అర్హతగా పరిగణించలేదని ఆయన తెలిపారు. అయితే 2012 ఆగస్టు 9న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.74 ప్రకారం నిర్వహించిన గత నియామకాలలో ఇంటర్-కాలేజియేట్ పోటీలు, ఇంటర్-డిస్ట్రిక్ట్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్, మహిళా క్రీడా ఉత్సవాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGFI) పోటీలు వంటి విభాగాల్లో పాల్గొనడం లేదా పతకాలు సాధించడం కూడా ఉద్యోగ అర్హతకు పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. అదే విధానం 2019లో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సుమారు 1.20 లక్షల నియామకాలలో కూడా అమలులో ఉన్నట్లు ఆయన పేర్పొన్నారు.
జీఓ-4 ప్రకారం అత్యున్నత క్రీడా విజయాలకే ప్రాధాన్యం…
ప్రస్తుత నియామకాల్లో జాతీయ క్రీడలు (National Games), జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లు, అంతర్జాతీయ స్థాయి పోటీలలో సాధించిన విజయాల ఆధారంగా మాత్రమే ప్రాధాన్యత కేటాయించినట్లు ఆయన తెలిపారు.
382 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లోనే ఉన్నాయి…
డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగమయ్యారని ఆయన తెలిపారు. వీరిలో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. ఖో-ఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాప్టుబాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో భాగమయ్యారని ఆయన తెలిపారు.
ప్రతి సర్టిఫికేట్‌పై బహుస్థాయి ధృవీకరణ…
సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికేట్‌ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు వెల్లడించారు.
దుర్గయ్య కేసుపై వివరణ…
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థి అనిగి దుర్గయ్య తనకు జాతీయ క్రీడల్లో సాధించిన విజయాలున్నప్పటికీ ఉద్యోగం రాలేదని చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇస్తూ దుర్గయ్య 32వ నేషనల్ గేమ్స్ కు సంబంధించిన సర్టిఫికేట్‌ను ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయలేదని, భౌతిక ధృవీకరణ సమయంలో మాత్రమే ఆ వివరాలను సమర్పించినట్లు తెలిపారు. అయితే జీఓ-4 మరియు నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత గడువులో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన నిబంధన ఉన్నందున, అనంతరం సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యపడలేదని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి ఆన్లైన్లో సరైన సర్టిఫికేట్‌ను సమర్పించి ఉంటే, అతని అర్హతను సంబంధిత ప్రాధాన్యత క్రమంలో పరిశీలించే అవకాశం ఉండేదని వివరించారు.
గత నియామకాలు – ప్రస్తుత నియామకాల మధ్య తేడా…
2019 గ్రామ/వార్డు సచివాలయ నియామకాలలో ఇంటర్-కాలేజియేట్, రూరల్ స్పోర్ట్స్, ఇంటర్-డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ వంటి కేటగిరీలను పరిగణనలోకి తీసుకుని వందలాది మందికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ, ప్రస్తుత డీఎస్సీ నియామకాల్లో అమలులో ఉన్న జీఓ-4 ప్రకారం అలాంటి కేటగిరీలు పరిగణనలో లేవని ఆయన స్పష్టం చేశారు.
క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం…
స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల కల్పన వెనుక ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు కల్పించడమేనని శాప్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భరణి తెలిపారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మరింత మంది యువత క్రీడల వైపు ఆకర్షితులవుతారని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ కమినషర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

