ప్రజల నమ్మకాన్ని పొందాం… నిలబెట్టుకుంటాం

ప్రజల నమ్మకాన్ని పొందాం… నిలబెట్టుకుంటాం

ఎంతో చేశాం… మరింతగా అభివృద్ధి చేస్తాం

కేంద్ర సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం

మేనిఫెస్టో అమలుపై చర్చకు సిద్దం

కూటమిది పాజిటివ్ పాలిటిక్స్… గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్

నాడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు… నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

రాజధానిపై మూడు ముక్కలాట…మావిగనో…? వాటికనో…?

ఎమ్మెల్యేలు ప్రజా సేవకులే కానీ పెత్తందారులు కాదు

ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను… చర్యలుంటాయ్

2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి

తిరుపతి, జూన్ 12 న్యూస్ వెలుగు : 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గెలుపుగా కాకుండా… బాధ్యతగా భావిస్తూ పాలన మొదలు పెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనపై ప్రజల్లో నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన కొనసాగిస్తామని సీఎం వెల్లడించారు. శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో రెండేళ్ల పాలనపై జరిగిన విజయోత్సవ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరుతో చేపట్టిన ఈ సభలో పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సుపరిపాలనలో భాగంగా అందిస్తున్న సేవలను సభావేదికగా చెప్పారు. ఇక రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్న కేంద్రం.. చేయూతనందిస్తున్న ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండేళ్ల కాలంలో డబుల్ ఇంజిన్ సర్కార్ చేసిన ప్రగతిని వివరించడంతోపాటు… రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ఇక ప్రజా ప్రతినిధులు పెత్తందార్లుగా కాకుండా.. ప్రజా సేవకులుగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రెండేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ఇచ్చిన పిలుపునకు మద్దతు పలికారు. 57 శాతం ఓట్ షేర్ తో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో ఎన్డీఏకు అధికారాన్ని అందించారు. 2024 ఫలితాలను గెలుపుగా కాదు రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పజెప్పిన బాధ్యతగా భావించాం. పాలకులుగా కాకుండా సేవకులుగా పని చేస్తున్నాం. అధికారం చేపట్టే సమయానికి అన్ని రంగాల్లో సంక్షోభం-వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం రూ.10 లక్షల కోట్ల అప్పుతో ముగిసింది. కేంద్ర పథకాలను, సాగునీటి పథకాలను నిర్వీర్యం చేశారు. ఇన్వెస్టర్లను వెంటాడి వేటాడి తరిమేశారు. యువత భవిష్యత్తును దెబ్బ తీశారు. ప్రశ్నించిన ప్రజలను వేధించారు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఇబ్బందులు పెట్టారు. మేం కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా పనిచేసి ప్రజల కోసం నిలబడ్డాం. రాష్ట్ర దుస్థితిని చూసి భయపడకుండా 7 శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు వాస్తవ విషయాలు తెలియచేసాం. ప్రజలు చూపిన విజ్ఞతతో డబుల్ ఇంజన్ సర్కార్ గెలిచింది. రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు విజ్ఞత చూపారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టాం. ఎన్డీఏ ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

గత ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలను పొగొట్టుకున్నాం

“2019-24 మధ్య కాలంలో ఐదేళ్ల పాటు ఏపీ అవకాశాల్ని పోగొట్టుకుంది. విధ్వంసాన్ని సరి చేసేందుకు ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నాం. ప్రజల సేవకు పునరంకితం కావడానికే ఈ విజయోత్సవ సభను నిర్వహించుకుంటున్నాం. విమర్శలకు ఆధారాలతో సహా సమాధానం చెప్పే గుండె ధైర్యం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. ఇచ్చినట్టే పాలన అందిస్తున్నాం. సూపర్ సిక్స్ తో పాటు మేనిఫెస్టోలో హామీల అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని సాధించాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా రూ.65 వేల కోట్ల పెన్షన్లు, తల్లికి వందనం ద్వారా చిన్నారులకు చదువు చెప్పిస్తున్నాం. స్త్రీశక్తి ద్వారా 71 కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించాం. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో కలిసి రూ.20 వేలు ప్రతీ రైతుకూ అందించాం. 24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్ల డబ్బులు చెల్లి్స్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, అర్చకులు, ఇమామ్ లు, మౌజన్లు ఇలా అందరినీ గుర్తుపెట్టుకుని మరీ సంక్షేమం అందిస్తున్నాం. ఎస్సీ,ఎస్టీ, బీసీల సహా అందరికీ సబ్సీడీపై సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. పీ4 ద్వారా సమాజంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. విద్య వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూ సంజీవని ప్రాజెక్టు చేపట్టాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది టీచర్ పోస్టుల భర్తీతో పాటు 5757 మంది కానిస్టేబుళ్లను కూడా నియమించాం. ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లించాం. అప్పులు చేసే వ్యక్తికి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎమ్మార్వో ఆఫీసు, ఆస్పత్రి, మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టుకు పెట్టారు. యావత్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తికి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఉందా..? మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆట ఆడిన వ్యక్తులకు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. గత పాలకుల హయాంలో పెట్టుబడి దారులు రాష్ట్రం నుంచి పారిపోయారు. మళ్లీ ఏపీ బ్రాండ్ పునరుద్ధరించి పెట్టుబడుల్ని, ప్రాజెక్టుల్ని సాధిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నాం. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించాం… అందుకే పెట్టుబడులు వస్తున్నాయి. కేవలం 36 రోజుల్లోనే రాయలసీమలోని పుట్టపర్తికి 5వ జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ద విమాన ప్రాజెక్టుకు అనుమతులిచ్చాం. రాయలసీమ ఇక హార్టీ కల్చర్ హబ్. ఇక్కడికే స్పేస్, డ్రోన్, డిఫెన్సు పరిశ్రమలు వస్తున్నాయి. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గని నుంచి తవ్వకాలు ప్రారంభం అవుతాయి. గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడు రాష్ట్రాన్ని నిలబడుతున్నాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించాం. ఏపీని అగ్రస్థానంలో… అందరికీ ఆదర్శంగా నిలిపేందుకు అంతా కలిసి కృషి చేయాలి.”అని సీఎం చంద్రబాబు సూచించారు.

అభివృద్ధి చేస్తుంటే… అడుగడుగునా అడ్డుకుంటున్నారు

“రాయలసీమ ప్రాంతంలోని వివిధ ఖనిజాల ద్వారా వేర్వేరు పరిశ్రమలు వస్తాయి. 100 రోజుల్లోనే హంద్రీ-నీవా పూర్తి చేసి కుప్పానికి నీళ్లు తెచ్చాం. కల్యాణి డ్యామ్ కూడా పూర్తి చేసి శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్న వద్దకు నీళ్లు తెస్తాం. గత పాలకులు తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేసి మన అందరి మనోభావాలను దెబ్బతీసేలా గొడ్డలి పార్టీ ప్రవర్తించింది. తిరుమల జోలికి బ్రిటీషర్లు కూడా వెళ్లలేదు. కానీ గొడ్డలి పార్టీ ఆ దుర్మార్గం చేసింది. ప్రజలకు న్యాయం చేయాలన్నదే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల లక్ష్యం. విశాఖకు, గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు వస్తే, అమరావతికి క్వాంటం వ్యాలీ వస్తోంది. ఏపీకి పరిశ్రమలు రావాలి… మన రాష్ట్రం పురోగతి సాధించాలి. మన యువతకు ఉద్యోగాలు రావాలి. అందుకే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా మన యువతకు కల్పిస్తున్నాం. అడ్డగోలుగా జిల్లాలను విభజించారు. దానిని సరిచేసి మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రీసర్వే ప్రక్రియ ద్వారా భూ వివాదాలకు చెక్ చెబుతున్నాం. భూ రికార్డులను ప్రక్షాళన చేసేలా కార్యక్రమం చేపడుతున్నాం. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న శెట్టిపల్లి గ్రామంలో భూ వివాదాలకు చెక్ పెట్టాం. చెత్త పన్ను రద్దు చేయటంతో పాటు రాష్ట్రంలో చెత్తను, పరిపాలనలో చెత్తను కూడా తొలగిస్తున్నాం. పరిపాలనకు అడ్డంకులు కల్పించే కొన్ని పాత చట్టాలను రద్దు చేసి పాలనా సమర్ధత పెంచుతున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. తొలిసారి ట్రూ డౌన్ చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. రూ.4,668 కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించింది. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2047 స్వర్ణాంధ్ర దిశగా ఏపీ ముందుకు వెళ్తుంటే గొడ్డలి పార్టీ వెనక్కు లాగే ప్రయత్నం చేస్తోంది. పూర్తి పారదర్శకతతో నిర్ణయాలు తీసుకుంటుంటే లేని పోని దుష్ప్రచారం ఆ పార్టీ చేస్తోంది. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్ తో విష ప్రచారాలు చేస్తోంది. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న వ్యక్తి ఏం చేశారో అందరికీ తెలుసు. జే బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు. మహిళల మంగళసూత్రాలు తెంచారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలో ఎన్ని వారాలు ఉన్నారో అందరికీ తెలుసు. జాబ్ క్యాలెండర్ అని ఘనంగా ప్రకటించి ఒక్కసారి కూడా విడుదల చేయలేక పోయింది గొడ్డలి పార్టీ. అమరావతిపై ఊసరవెల్లి రాజకీయాలు చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడుముక్కల ఆటలాడారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు… అది మావిగనో వాటికనో..? వైసీపీ ఫేక్ న్యూస్ ను నమ్మకుంటే… మేం ప్రజలను నమ్ముకున్నాం. ఫ్రస్ట్రేషన్ తో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోంది. కూటమిది పాజిటివ్ పాలిటిక్స్… గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్. ప్రజా ప్రభుత్వానికి ప్రజలే ఫస్ట్, దేశం- రాష్ట్రమే కూటమి అజెండా. దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. తాము పెత్తందార్లు కాదు, ప్రజలకు సేవకులమనే విషయాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలి. ఎన్టీఏ కూటమిపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఓ బ్లూ ప్రింట్ మన దగ్గర ఉంది. రెండేళ్ల క్రితం ఇదే రోజు సుపరిపాలనలో ఓ హంబుల్ బిగినింగ్ చేశాం. మేనిఫెస్టో అమలుపై చర్చించడానికి నాతో పాటు ఎన్డీఏ కూటమిలోని ప్రతీ కార్యకర్తా సిద్ధమే. నా దేశం – నా బాధ్యత అనే ఆలోచనతోనే మనం అంతా పని చేయాలి. ప్రజా ప్రభుత్వం అనుక్షణం ప్రజల గురించే ఆలోచిస్తుంది. అభివృద్ధికి, సుపరిపాలనకు పునరంకితం అయ్యేలా సంకల్పం తీసుకుందాం. త్వరలోనే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ట్రాక్ రికార్డు ప్రజా ప్రభుత్వానిది విధ్వంసం చేసిన రికార్డు గొడ్డలి పార్టీది.”అని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

దేశానికి దిశా నిర్దేశంలా మోదీ 12 పాలన

“రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచింది. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నందుకు ఆయనకు అభినందనలు. మోదీ 12 ఏళ్ల పాలన దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేలా చేసింది.. భవిష్యత్తుకు పునాదులు వేసింది. వరుసగా మూడు సార్లు మోదీకి మద్దతుగా నిలవటం వల్లే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తోంది. 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి విముక్తి కల్పించిన నేత ప్రధాని మోదీ. 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 160 ఎయిర్ పోర్టులు నిర్మించారు. చంద్రయాన్, గగన్ యాన్ లాంటి ప్రాజెక్టులు దేశప్రతిష్టను పెంచాయి. ఆపరేషన్ సింధూర్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటింది. పశ్చిమాసియాలో యుద్ధంతో రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధాని మోదీ చేపట్టిన చర్యల కారణంగా అతి తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన దేశంగా భారత్ ఉంది.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందాం: లబ్దిదారులు

2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులు తాము పొందిన లబ్దిని సభా వేదిక మీద నుంచి వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా తాను పొందిన లబ్దిని.. తన అనుభవాన్ని ఉష అనే యువతి వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో తనకు కలిగిన మేలును చంద్రబాబు అనే రైతు చెప్పారు. తన ఐదుగురు పిల్లలకు తల్లికి వందనం నిధులు తన ఖాతాలో జమ అయ్యాయని.. చక్కగా చదువుకుంటున్నారని తల్లికి వందనం లబ్దిదారు పులిచర్ల నాగమ్మ సంతోషంగా చెప్పారు. తనకు కూటమి ప్రభుత్వం ఇల్లును ఇచ్చిందని నాగమ్మ సభా వేదికగా వెల్లడించింది. రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వీడియోను ప్రజెంట్ చేశారు. 2 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ప్రాంతాల వారీగా జరిగిన అభివృద్ధిని అద్దం పట్టేలా వీడియోను రూపొందించారు. కేంద్రం అందించిన సాయాన్ని… ప్రధాని మోదీ అందిస్తోన్న సహకారాన్ని వివరిస్తూ వీడియోను ప్రజెంట్ చేశారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎలా పని చేస్తున్నారనే విషయాలను క్రోడికరిస్తూ వీడియో రూపకల్పన చేశారు. ఈ సభకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS