
గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలి
డిప్యూటీ కలెక్టర్ కొండలరావును కలిసి వినతిపత్రం అందజేసిన ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్
కర్నూలు , న్యూస్ వెలుగు : నేడు కర్నూలు నగరంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ కొండలరావును రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదాసి కురువ సుంకన్న కలిసి గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రవహించే తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉందని అయితే 2019లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2,890కోట్ల నిధులతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని 21-02-2019తేదీన జీవో నెంబర్ 154ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని అయితే ఇప్పటికీ ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదని గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం ద్వారా రాయలసీమ జిల్లాల్లో కరువు,వలసలను నివారించవచ్చునని రాయలసీమలో దాదాపు రెండు లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు వందలాది గ్రామాలకు తాగునీరు లభించే అవకాశం ఉందని ,ప్రతి సంవత్సరం తుంగభద్ర నది ద్వారా సముద్రం పాలవుతున్న వందలాది టిఎంసిల నీటిని కాపాడుకోవడానికి రాయలసీమ ప్రాంతాన్ని కరువు,వలసల నుండి రక్షించుకోవడానికి తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం జరగకూడదని మాట్లాడుతున్నారని కృష్ణానదిపై అనేక నీటి ప్రాజెక్టులను,ఎత్తిపోతల పథకాలను నిర్మించుకొని నీటిని తీసుకు వెళ్తున్న రాయలసీమ ప్రాంత ప్రజలు తెలంగాణ సస్యశ్యామలం కావాలనే కోరుకున్నారని అయితే కరువు, వలసలు,రైతుల ఆత్మహత్యలతో నలుగుతున్న రాయలసీమ ప్రాంతానికి ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరమని గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు కూడా నీళ్లు వెళతాయని ఈ విషయాన్ని తెలంగాణ నాయకులు కొందరు గుర్తించకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడటం అన్యాయమని అన్నారు. కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గుండ్రేవుల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాబోయే బడ్జెట్ కేటాయింపుల్లోని రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి గుండ్రేవుల నిర్మాణం చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు కే.రాము,మదాసి సురేష్,భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

